Begin typing your search above and press return to search.

రామోజీతో షా ఏకాంత చ‌ర్చ‌ల సారాంశం అదేన‌ట‌!

By:  Tupaki Desk   |   13 Aug 2018 5:55 AM GMT
రామోజీతో షా ఏకాంత చ‌ర్చ‌ల సారాంశం అదేన‌ట‌!
X
ఈ మ‌ధ్య‌న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా హైద‌రాబాద్‌కు రావ‌టం తెలిసిందే. తానున్న కొద్ది గంట‌ల్లో కొద్ది మంది ప్ర‌ముఖుల్ని క‌లుసుకున్న అమిత్ షా.. ప‌నిలో ప‌నిగా రామోజీ గ్రూపుల అధినేత‌.. మీడియా మొఘ‌ల్ రామోజీరావును క‌ల‌వ‌టం తెలిసిందే. ఈ భేటీ వేళ‌లో.. షా.. రామోజీ ఇరువురు 45 నిమిషాల‌కు పైనే చ‌ర్చ‌లు జ‌ర‌ప‌టం అప్ప‌ట్లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే.. ఈ ర‌హ‌స్య స‌మావేశానికి సంబంధించిన వివ‌రాలు కొన్ని ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. షా.. రామోజీల మ‌ధ్య జ‌రిగిన సమావేశ వివ‌రాలు.. ఆ సంద‌ర్భంగా మాట్లాడుకున్న అంశాలపై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. రామోజీతో షా భేటీ వ్యూహాత్మ‌క‌మైన‌ద‌ని చెబుతున్నారు.

ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ పార్టీతో జ‌త క‌ట్టే దిశ‌గా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్లాన్ చేస్తున్న అంశంపై పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఏపీలో బ‌లంగా ఉన్న వైఎస్ జ‌గ‌న్ ను ఎదుర్కోవ‌టం బాబు ఒక్క‌డి వ‌ల్ల కాక‌పోవ‌టంతో ప్లాన్ బీ మీద దృష్టి సారించిన‌ట్లుగా తెలుస్తోంది.

ఏపీలో బాబు కంటే జ‌గ‌న్ కు 10 శాతానికి పైనే ఓట్లు ఎక్కువ రానున్న వైనం ఇటీవ‌ల జ‌రిపిన ప‌లు స‌ర్వేలు స్ప‌స్టం చ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ను దెబ్బ తీసేందుకు వీలుగా కాంగ్రెస్ తో జ‌త క‌ట్టాల‌ని బాబు భావిస్తున్నారు.హోదా విష‌యంలో ఏపీకి మోడీ అండ్ కో హ్యాండ్ ఇచ్చిన నేప‌థ్యంలో.. మోడీ స‌ర్కారుకు టీడీపీ త‌మ్ముళ్లు గుడ్ బై చెప్పారు. ఇదిలా ఉంటే.. హోదాపై మోడీ ప‌రివారం తీసుకున్న నిర్ణ‌యంపై ఏపీలో తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలాంటి వేళ‌.. క‌మ‌ల‌నాథుల‌తో బాబు క‌లిసి ఉంటే.. మొత్తంగా మునిగిపోవ‌టం ఖాయం.

అందుకే.. మాస్ట‌ర్ ప్లాన్ వేసిన‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌స్తుతానికి మోడీ ప‌రివారానికి దూరంగా ఉంటున్న చంద్ర‌బాబు.. కాంగ్రెస్ కు ద‌గ్గ‌ర కావ‌టానికి పావులు క‌దుపుతున్నారు.

ఇదంతా ప‌రిమిత కాలం కోస‌మే త‌ప్పించి మ‌రొక‌టి లేద‌న్న మాట వినిపిస్తోంది. ఎన్నిక‌ల అనంత‌రం మ‌ళ్లీ ఎన్డీయే స‌ర్కారులో చేరేందుకు రంగం సిద్ధ‌మైన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప్లాన్ ను ప‌క్కా అమ‌లు కావ‌టం కోస‌మే అమిత్ షా.. రామోజీల భేటీ జ‌రిగిందున్న మాట వినిపిస్తోంది.

ఏపీలో జ‌గ‌న్ మీద గెల‌వాలంటే బాబుకున్న ప్ర‌స్తుత బ‌లం స‌రిపోద‌ని.. అద‌న‌పు శ‌క్తి కోసం కాంగ్రెస్ తో జ‌త క‌ట్ట‌టం ద్వారా తాము అనుకున్న ఫ‌లితాన్ని సాధించొచ్చ‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. రామోజీ ఫిలింసిటీలో 45 నిమిషాల పాటు సాగిన ఏకాంత స‌మావేశంలో దీనికి సంబంధించిన అభ‌యం బాబు త‌ర‌ఫున రామోజీ ఇచ్చిన‌ట్లుగా ఒక క‌థ‌నం ప్ర‌చారంలో ఉంది. ఇది ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌న్న‌ది రానున్న రోజులు స్ప‌ష్టం చేయ‌టం ఖాయ‌మంటున్నారు.