Begin typing your search above and press return to search.

అమరావతి వ్యవహారంపై అమిత్ షా కూపీ

By:  Tupaki Desk   |   11 Jan 2020 4:33 PM GMT
అమరావతి వ్యవహారంపై అమిత్ షా కూపీ
X
ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతి ఇప్పుడు దిక్కూమొక్కు లేకుండా మారిపోతున్నా కేంద్రంలో ఇంతవరకు దీనిపై కదలిక లేదు. అయితే.. తాజాగా కేంద్రం హోం మంత్రి అమిత్ షా ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఓ కన్నేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన జగన్ ప్రతిపాదిస్తున్న మూడు రాజధానుల వ్యవహారంపై నివేదిక తెప్పించుకునేందుకు తన ముఖ్య అనుచరుడిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

తెలంగాణకు చెందిన కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డికి ఈ పని అప్పగించినట్లు సమాచారం. అందులోభాగంగానే ఆయన ఏపీలో పర్యటించి వాస్తవ పరిస్థితులు తెలుసుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ లో ఉంటూ ఏపీకి చెందిన రైతు ప్రతినిధులు - పార్టీ వర్గాలు - మరికొందరు సామాజిక వేత్తలతో కిషన్ రెడ్డి భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం అమరావతి ఏరియా రైతాంగం కిషన్ రెడ్డిని కలిశారని బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరోవైపు ఆయన ఏపీలోని మూడు ప్రాంతాల్లో పర్యటించి మూడు రాజధానులపై జనంలో ఎక్కడెలాంటి స్పందన ఉందో తెలుసుకునేందుకు పర్యటించబోతున్నట్లు చెబుతున్నారు.

మూడు రాజధానుల ప్రతిపాదన కార్యరూపం దాల్చి - ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకునే నాటికి తమ వద్ద సమగ్ర సమాచారం వుండాలని అమిత్ షా బావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే తగిన విధంగా వ్యూహాన్ని అమలు పరిచేలా బీజేపీ అధిష్టానం- కేంద్ర హోంశాఖ సిద్దంగా వుండాలని అమిత్ షా నిర్ణయించినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే ఆ సంగతి చూడమంటూ కిషన్ రెడ్డిని అమిత్ షా పురమాయించినట్లు బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.