Begin typing your search above and press return to search.

ఎన్పీఆర్ పై కేంద్రం కీలక ప్రకటన..డాక్యుమెంట్లేమీ అడగరట!

By:  Tupaki Desk   |   16 Jan 2020 4:27 PM GMT
ఎన్పీఆర్ పై కేంద్రం కీలక ప్రకటన..డాక్యుమెంట్లేమీ అడగరట!
X
ఎన్నార్సీ - సీఏఏలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసన దెబ్బకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు దిగిరాక తప్పలేదన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది. ఎన్నార్సీ - సీఏఏలతో ముడిపెట్టి ఎన్పీఆర్ పైనా పెద్ద ఎత్తున ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నార్సీతో ఎన్పీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని కేంద్రంలోని బీజేపీ సర్కారు చెప్పినా కూడా జనంలో ఆందోళనలు తగ్గలేదు. ఎన్పీఆర్ పేరిట వివరాలు సేకరిస్తున్న సమయంలోనే గుట్టుగా ఎన్నార్సీని కూడా అమలు చేస్తారన్న వాదన వినిపించింది. అంతేకాకుండా రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ వెబ్ సైట్ లో ఎన్పీఆర్ లో పలు వివరాలు సేకరించనున్నట్లు - అంతేకాకుండా కొన్ని డాక్యుమెంట్లను కూడా అడగనున్నట్లు - బయోమెట్రిక్ సేకరణ కూడా ఉంటుందన్న విషయం జనంలోని ఆందోళనలను మరింత పెంచేశాయనే చెప్పాలి.

ఈ నేపథ్యంలో ఎన్పీఆర్ పై జనంలో నెలకొన్న ఆందోళనలను నివృత్తి చేసే దిశగా కేంద్రం కీలక ప్రకటన చేయక తప్పలేదు. జాతీయ జనాభా పట్టికను అప్డేట్ చేయడం కోసం.. ఎలాంటి డాక్యుమెంట్లు అడగబోమని.. బయోమెట్రిక్‌తో కూడా ఎలాంటి వివరాలు తీసుకోమంటూ.. కేంద్ర హోం శాఖ సోమవారం కీలక ప్రకటన చేసింది. గతకొద్ది రోజులుగా ఈ జాతీయ జనాభా పట్టిక విషయమై.. వెస్ట్ బెంగాల్ - అసోం వంటి రాష్ట్రాలతో పాటుగా విపక్షాలు దీనిపై అభ్యంతరాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ బుధవారం ఈ కీలక ప్రకటన చేసింది.

ఎన్పీఆర్ ప్రక్రియ అప్డేట్ నిమిత్తం.. కొన్ని ప్రశ్నలతో కూడిన పత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. అయితే.. రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫీస్ వెబ్‌ సైట్లో ఉన్న సమాచారం ప్రకారం.. వ్యక్తి పేరు - వయసు - జాతీయత వంటి వివరాలతోపాటు.. బయోమెట్రిక్ వివరాలను ఈ ఎన్‌పీఆర్‌ డేటాబేస్‌ కలిగి ఉంటుంది. ‘దేశంలో నివసిస్తున్న వ్యక్తుల పూర్తి సమాచారం రూపొందించడమే ఈ ఎన్‌పీఆర్‌ ముఖ్య ఉద్దేశమని.. అందులో ప్రజల వివరాలతోపాటుగా సదరు వ్యక్తి బయోమెట్రిక్ వివరాలు కూడా ఉంటాయ’ని ఆ వెబ్‌సైట్ పేర్కొంటుంది. ఇప్పుడు కేంద్రం ప్రకటనతో ఈ విషయంపై ఉన్న ఆందోళనలు తగ్గిపోతాయన్న వాదన వినిపిస్తోంది.