Begin typing your search above and press return to search.

'గోలీమారో' వ్యాఖ్యలే మమ్మల్ని ఓడించాయి..

By:  Tupaki Desk   |   14 Feb 2020 8:30 PM GMT
గోలీమారో వ్యాఖ్యలే మమ్మల్ని ఓడించాయి..
X
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించి మూడోసారి అధికారంలోకి వచ్చింది. అయితే అధికారమే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగిన బీజేపీ దారుణ ఫలితాలు చవిచూసింది. గతం కన్నా కొన్ని సీట్లు పెరిగినా సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. ఆ ఘోర ఓటమి పై తొలిసారి అమిత్ షా మాట్లాడారు. ఓటమికి గల కారణాలను ఆయన వెల్లడించారు. కేవలం 8 సీట్లకు పరిమితమవడం తదితర అంశాలపై స్పందించారు.

ఢిల్లీ ఎన్నికల్లో గెలుపోటముల కోసం తలబడలేదని.. కేవలం తమ భావజాలాన్ని విస్తరించుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని వివరణ ఇచ్చారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై సీఏఏ, ఎన్ఆర్సీల ప్రభావం పడలేదని స్పష్టం చేశారు.తమ అంచనా పూర్తిగా తలకిందులైందని వాపోయారు. ఎన్నికల ప్రచార వేళ తమ పార్టీ నాయకులు కొంతమంది ‘గోలీమారో’, ‘ఇండో-పాక్ మ్యాచ్’ వంటి వ్యాఖ్యలు చేయకూడదనిదని, అలాంటి వ్యాఖ్యల వల్లే బీజేపీకి నష్టం వాటిల్లిందని ఓటమిని కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నించారు.

అనంతరం సీఏఏ వ్యతిరేక ఆందోళనలపై కూడా స్పందించారు. ఈ దేశాన్ని మత ప్రాతిపదికతో కాంగ్రెస్ పార్టీనే విభజించిందని ఆరోపించారు. సీఏఏ సంబంధిత అంశాలపై ఎవరైనా వచ్చి తనతో మాట్లాడాలని అనుకుంటే.. వారికి మూడు రోజుల్లో సమయాన్ని కేటాయిస్తానని అమిత్ షా ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌ లో నేతల గృహ నిర్బంధం, అరెస్ట్ నిర్ణయం అంతా స్థానిక అధికారులేదని.. దానిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని తెలిపారు. ఎన్ఆర్పీ ప్రక్రియకు ఎలాంటి పత్రాలు చూపించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎలాంటి ఆందోళనలు చెందవద్దని ప్రజలకు సూచించారు.