Begin typing your search above and press return to search.

ఓర్నీ.. మోడీని కలిసేందుకూ రేషనా?

By:  Tupaki Desk   |   15 Dec 2016 4:30 AM GMT
ఓర్నీ.. మోడీని కలిసేందుకూ రేషనా?
X
రేషన్ కు.. మోడీకి అవినాభావ సంబంధం ఉందా? అన్న అనుమానం ఈ మధ్యన కలుగుతోంది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే.. ఏదీ అపరిమితంగా పొందటం ఆయనకు ఇష్టం ఉండదా? అన్న భావన కలుగుతోంది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం పుణ్యమా అని.. సొంత సొమ్మును తమకు తోచినట్లుగా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి. పరిమితు చట్రంలో బిగించేస్తున్న మోడీ నిర్ణయాలు దేశ ప్రజలకు నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయి.

ఇది చాలదన్నట్లుగా.. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తాజాగా తీసుకున్న నిర్ణయం పార్టీ వర్గాలకు షాకింగ్ గా మారుతుందనటంలో సందేహం లేదు. ప్రధాని మోడీకి స్వాగతం చెప్పే మొదలు.. ఆయన పాల్గొనే సమావేశాల్లో వేదిక మీద ఎంతమంది ఉండాలి? ఎంతమంది ఆయన్ను కలవాలన్న అంశంపై తాజాగా కొత్త మార్గదర్శకాల్ని సిద్ధం చేశారు.

ఇకపై మోడీ పాల్గొనే బహిరంగ సభ వేదిక మీద ఏడుగురికి మించి ఉండకూడదన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఒకవేళ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో నిర్వహించే సభలకు మాత్రం కాస్త మినహాయింపులు ఇవ్వనున్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మాత్రం ఏడుగురు నుంచి పదకొండు మంది వరకూ నేతల్ని వేదిక మీద ఉండేందుకు అనుమతి ఇస్తారు. ఇక.. విమానాశ్రయాలు.. హెలిప్యాడ్ల వద్ద ప్రధాని మోడీకి స్వాగతం పలికే వారి సంఖ్యను కుదించటం గమనార్హం.

వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చే మోడీకి విమానాశ్రయాల్లో.. హెలిప్యాడ్ల వద్ద స్వాగతం పలికేందుకు ముగ్గురు నేతల్ని మాత్రమే అనుమతించనున్నారు. మరి.. ఈ తరహా రేషన్ పార్టీ నేతలకు అసంతృప్తి కలిగించటం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. మోడీ లాంటి నాయకుడు తమ ప్రాంతానికి వస్తే.. ఆయన్ను కలవాలని.. ఆయనతో వేదిక పంచుకోవాలని తపించే వారు భారీగా ఉంటారు. అందరిని కాకున్నా.. కొందరినైనా అనుమతించాల్సింది పోయి.. పరిమితులు విధించటం కమలనాథులకు కోపాన్ని తెప్పించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. అందరికి అసంతృప్తిని కలిగిస్తూ సాధించేదేమిటో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/