Begin typing your search above and press return to search.

అమిత్ షా: బాబు గుడ్‌ బై చెప్పేశాడు..సో వాట్‌?

By:  Tupaki Desk   |   27 May 2018 4:39 AM GMT
అమిత్ షా: బాబు గుడ్‌ బై చెప్పేశాడు..సో వాట్‌?
X
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుకు ఏ మాత్రం మింగుడుప‌డ‌ని అంశం. త‌న నిర్ణ‌యంతో ప్ర‌కంప‌న‌లు చెల‌రేగుతున్నాయ‌ని - కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అల్ల‌క‌ల్లోలం అయిపోతోంద‌ని ఆయ‌న భావిస్తుంటే...అంత సీన్ లేనేలేద‌ని ఆ పార్టీ అధినేత అమిత్‌షా కొట్టిపారేశారు. బీజేపీ ప్రభుత్వానికి నాలుగేళ్లు నిండిన నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమికి వ‌చ్చిన న‌ష్ట‌మేమీ లేద‌ని - తాము బ‌లంగానే ఉన్నామ‌ని అమిత్ షా తెలిపారు. త‌మ కూట‌మి నుంచి చంద్రబాబు తప్పుకున్నా.. బీహార్ ముఖ్య‌మంత్రి - జేడీయూ నేత నితీశ్ వచ్చారని ఆయన గుర్తుచేశారు. ఎన్డీఏ కుటుంబం పెరిగిందని - బాబు నిష్క్రమణతో తమకు ఎటువంటి లోటు లేదని షా కుండ‌బద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పారు.

త‌న ఆలోచ‌న‌ల ప్ర‌కార‌మే ఎన్డీఏ కూట‌మికి చంద్ర‌బాబు గుడ్‌ బై చెప్పార‌ని అమిత్ ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ చేసిన హామీలు 100కు 110 శాతం అమలు చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రాల్లో జరిగే ప్రాజెక్ట్‌ లకు నూరు శాతం నిధులు ఇవ్వరనీ - అయితే పోలవరం ప్రాజెక్ట్‌కు నూరు శాతం నిధులు సమకూర్చడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో బీజేపీ 85 శాతం నెరవేర్చిందన్నారు. రైల్వేజోన్‌ - కడప ఉక్కు ఫ్యాక్టరీ - దుగరాజపట్నం పోర్టు - పెట్రోలియం కర్మాగారం తదితర హామీలను కూడా బీజేపీ నెరవేరుస్తుందన్నారు. విభజన హామీలు పదేళ్లలో పూర్తి చేయాల్సి ఉందన్నారు. మ‌రో మిత్ర‌ప‌క్ష‌మైన శివ‌సేన కూడా ఎన్డీఏకు దూర‌మ‌వ‌డంపై అమిత్ షా స్పందిస్తూ 2019 ఎన్నికల్లో శివసేనతో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సమయంలోనూ ఇంధన ధరలు ఇలాగే ఉన్నాయని - కానీ మా ప్రభుత్వం సమయంలో కనీసం మూడు రోజులు కూడా కాంగ్రెస్ తట్టుకోలేకపోతున్నదని ఆయ‌న ఎద్దేవా చేశారు. పెట్రోల్ - డీజిల్ ధరలు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని - సుదీర్ఘకాల పరిష్కారం కోసం వెతుకుతున్నట్లు ఆయన తెలిపారు. పాకిస్థాన్‌ తో యుద్ధం చేయాలన్నది చివరి ఆప్షన్‌ గా మాత్రమే తీసుకుంటామని - సరిహద్దు సంరక్షణ విషయంలో వెనక్కి తగ్గేదిలేదన్నారు. బీజేపీ ప్రభుత్వ సమయంలోనే ఉగ్రవాదులు ఎక్కువ మంది చనిపోయారన్నారు. మోడీ మోస్ట్ హార్డ్‌ వర్కింగ్ ప్రధాని అని షా కితాబు ఇచ్చారు.