Begin typing your search above and press return to search.

అమిత్ షా నుంచి కమలదళానికి ముందే లీకులు!

By:  Tupaki Desk   |   10 Feb 2018 1:48 PM GMT
అమిత్ షా నుంచి కమలదళానికి ముందే లీకులు!
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీల పరంగా తాము ఏమేం చేయబోతున్నామో, ఆంధ్రప్రదేశ్ లోని కాషాయదళాలకు ముందే లీకులు అందుతున్నాయి. తాము నయాపైసా ఏపీకి విదిలించినా సరే.. దానికి సబంధించి రూపాయి ప్రచారం జరగాలంటూ ఏపీ నాయకులకు భాజపా అధిష్టానం నుంచి ఆదేశాలు అందుతున్నాయి. ఈ మేరకు కమలదళాలంతా సమాయత్తం అవుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఢిల్లీనుంచి అమిత్ షా.. రాష్ట్రానికి చెందిన పలువురు కీలక భాజపా నాయకులతో టచ్ లోనే ఉన్నారని.. తమ నిర్ణయాలు వచ్చిన వెంటనే.. తాము ఏపీకి చేస్తున్న మేలు గురించి విస్తృతంగా ప్రచారం జరగాలని, రాష్ట్రవ్యాప్తంగా మారుమూల గ్రామాలకు కూడా కేంద్ర సాయం గురించి స్పష్టంగా వెళ్లేలా నాయకులు పనిచేయాలని పురమాయిస్తున్నారట. రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుతో పాటూ.. మీడియాలో యాక్టివ్ గా ఉండే రాష్ట్ర భాజపాకు చెందిన మరికొందరు నాయకులతో కూడా.. అమిత్ షా ప్రత్యేకంగా ఫోను చేసి మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది.

ఏపీకి ఏ చిన్న సాయం చేసినా.. దాని ద్వారా తమకు రాగల గరిష్టమైన రాజకీయ ప్రయోజనం సిద్ధింపజేసుకోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఈ విషయం మాత్రం క్లియర్ ఎందుకంటే.. పార్లమెంటు సాక్షిగానే ఆ విషయం ప్రస్ఫుటం అయింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తొలుత జైట్లీతో మాట్లాడిన తర్వాత.. ఆ చర్చల వల్ల ఉపయోగం ఉండదని తెలుసుకుని... తర్వాత అమిత్ షాను కూడా తన వద్దకు పిలిపించుకుని మంతనాలు సాగించినట్లుగా సమాచారం. వారిద్దరితో కలిసి కూడా వెంకయ్యభేటీ అయి.. ఏపీ గురించి ప్రస్తావించారు.

ఆ తర్వాత జైట్లీ సభలో ప్రకటన చేస్తున్న సమయంలో అమిత్ షా అంగీకరించిన కొన్ని అంశాలను ఆ ప్రకటనలో జత చేయాలని.. సుజనా చౌదరి ఆయన వద్దకు వెళ్లి కోరినప్పుడు కూడా.. జైట్లీ చాలా సున్నితంగా తిరస్కరిస్తూ.. మొత్తం అమిత్ చేతుల్లో ఉన్న విషయాన్ని అన్యాపదేశంగా బయటపెట్టారు. అమిత్ షా వద్ద రాయించుకుని వస్తే తప్ప చెప్పనని అన్నారు. ఆ రకగా అమిత్ పాత్ర పెరుగుతున్నదంటే రాజకీయ లబ్ధికి ప్రణాళికే అని భావింవచ్చు. దానికి నిదర్శంగానే ఇంకా ఢిల్లీనుంచి ఏపీకి ఏం సాయం రాబోతున్నదో ప్రకటనలు వెలువడక ముందే.. ఆ ప్రకటనలు రాగానే సొంత డప్పు కొట్టుకోవడం గురించి మాత్రం భాజపా నేతలకు పురమాయింపు వచ్చేసినట్లు తెలుస్తోంది.