Begin typing your search above and press return to search.

దూకూడు పెంచిన కమలనాధులు..

By:  Tupaki Desk   |   24 Sep 2018 4:24 PM GMT
దూకూడు పెంచిన కమలనాధులు..
X
ముందస్తు ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ తన వేడిని పెంచింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితితో చెలిమి చేస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్న కాంగ్రెస్, ఇతర పక్షాలను ఇరుకున పెట్టేలా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మరోవైపు అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని కూడా ఎండగట్టేలా ప్రచారాన్ని పదునెక్కిస్తోంది. ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పైన - తెరాస ప్రభుత్వం పైన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. ఇప్పుడు మళ్లీ ఆయనే తెలంగాణలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలంటూ పార్టీ శ్రేణులకు ట్విట్టర్ ద్వారా ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై పెద్ద ఎత్తున్న ప్రచారం చేయాలని సూచించారు. ముందస్తు ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా అమిత్ షా దిశానిర్దేశం చేసారు. ఇందుకోసం ట్విట్టర్‌ ను వేదికగా చేసుకున్నారు. ఇది కూడా తెలుగులోనే ట్విట్ చేయడం విశేషం.

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను తెలంగాణలో ప్రజల ద్రుష‌్టికి తీసుకుని వెళ్లాలని అమిత్ షా ఆదేశించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన జన ఆరోగ్య యోజన --- ఆయష్మాన్ భారత్ పథకాన్ని ప్రజలలోకి తీసుకుని వెళ్లాలని పేర్కొన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన మంత్రి ప్రారంభించిన పథకం ప్రజలకు అందకుండా చేస్తోందని - ఇదీ బాధా కరమని అమిత్ షా వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం తన స్వార్ధం కారణంగా ఈ పథకానికి ఆదరణ లభించడం లేదని, దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఇక్కడి ప్రభుత్వం చిన్న చూస్తోందని ఆ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తెలంగాణలో ఇక్కడి ప్రభుత్వం పేదలకు వ్యతిరేకంగా తీసుకునే అన్ని నిర్ణయాలపైనా స్పందించాలని, పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ ట్విట్టర యుద్ధంతో భారతీయ జనతా పార్టీకి - తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి మధ్య రహస్య మైత్రి ఉందని వస్తున్న విమర్శలకు ఫుల్‌ స్టాప్ పెట్టినట్లేనని రాజకీయపరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ముందు ముందు కూడా ఈ ట్విట్టర్ల యుద్ధం మరింత ముదురుతుందని అంటున్నారు.