Begin typing your search above and press return to search.

‘రామాలయాన్ని’ తెరపైకి తీసుకొచ్చిన బీజేపీ

By:  Tupaki Desk   |   29 Jan 2017 4:37 AM GMT
‘రామాలయాన్ని’ తెరపైకి తీసుకొచ్చిన బీజేపీ
X
ఓపక్క ప్రత్యర్థి పార్టీలు ఆల్ ఫ్రీ అంటూ జనాకర్షక తాయిలాల్ని తెర మీదకు తీసుకొచ్చి.. ఎక్సైట్ అయిపోయేలా వరాల మూటల్ని ఓటర్ల మీదకు వదులుతున్న వేళ.. బీజేపీ యూపీ ఎన్నికల మేనిఫేస్టో ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలో ఉంది. ఏది ఏమైనా.. ఎలా అయినా యూపీ పీఠాన్ని చేజిక్కించుకోవాలని.. తమ సత్తా చాటాలని విపరీతంగా తపిస్తున్న బీజేపీ తాజాగా తన ఎన్నికల మేనిఫేస్టోను విడుదల చేసింది.

జనాకర్షక పథకాలు ఓపక్క మరోపక్క తేనెతుట్టలాంటి రామాలయాన్ని ప్రముఖంగా ప్రస్తావించటం గమనార్హం. రాజ్యాంగానికి లోబడి రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కమలనాథులు.. పలు జానాకర్షక పథకాల్ని తెర మీదకుతెచ్చారు. అదే సమయంలో తాము అధికారాన్ని చేజిక్కించుకుంటే.. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించనున్నట్లుగా ప్రకటించారు.

‘‘లోక కల్యాణ్ సంకల్ప్ పత్ర’’పేరుతో విడుదల చేసిన ఎన్నికల మేనిఫేస్టోలో రామందిర నిర్మాణం విషయంలో బీజేపీ ధృఢ సంకల్పంతో ఉన్నట్లుగా పేర్కొంటూ.. ‘‘రాజ్యాంగ నిబంధనలకు లోబడి రామ మందిరాన్ని నిర్మించే ప్రయత్నాలు జరిగేటట్లు చూస్తాం’’ అని ప్రకటించటం గమనార్హం. అంతేకాదు.. తాము అధికారంలోకి వస్తే.. ట్రిపుల్ తలాక్ అంశంపై మహిళల అభిప్రాయాన్ని తీసుకొని.. కేంద్రం తన అభిప్రాయాన్ని సుప్రీం దృష్టికి తీసుకెళుతుందని వెల్లడించారు. మతపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకొని.. ఏదైనా జిల్లాలోని ప్రజలు మూకుమ్మడిగా వలసపోయే పరిస్థితి తలెత్తితే.. అందుకు జిల్లా కలెక్టర్ ని బాధ్యుడ్ని చేస్తామని చెప్పిన బీజేపీ.. రాష్ట్రంలోని యాంత్రిక వధశాలల్ని మూసేస్తామని చెప్పారు.

చిన్నరైతులకు రుణమాఫీ.. విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్.. ఫ్రీ ఇంటర్నెట్.. పేదలకు విద్యుత్.. నీరు ఉచితంగా ఇవ్వటం.. బాలికలకు ఉచితంగా డిగ్రీ వరకూ విద్యను అందించటం..యాభై శాతం మార్కులు దాటిన బాలురకు డిగ్రీ వరకు ఉచిత విద్య.. సన్నకారు రైతులకు వడ్డీ లేకుండా రుణాలు.. వ్యవసాయాభివృద్ధికి రూ.150కోట్లతో నిధిని ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడించారు. మూడు.. నాలుగో తరగతి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు లేకుండా కేవలం పరీక్షల అధారంగా ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. యూపీ ఎన్నికల్లో తాము 300 సీట్లను గెలుచుకొని.. బలమైన ప్రభుత్వాన్ని కచ్ఛితంగా ఏర్పాటు చేస్తామని బీజేపీ జాతీయఅధ్యక్షుడు అమిత్ షా వెల్లడించారు. ప్రజాకర్షక పథకాలతో పాటు.. రామాలయం కమలనాథుల యూపీ రాజ్యాధికార కలల్ని ఎంతవరకు నిజం చేస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/