Begin typing your search above and press return to search.

మోదీపై ప్రియాంక‌!..ప్రియాంక‌పై అమిత్ షా!

By:  Tupaki Desk   |   7 May 2019 4:44 PM GMT
మోదీపై ప్రియాంక‌!..ప్రియాంక‌పై అమిత్ షా!
X
ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో నేత‌ల నోట నుంచి తూటాల్లా దూసుకువ‌స్తున్న మాట‌లు మంట‌లు రేపుతున్నాయి. స్థాయిని మ‌రిచి సంచ‌ల‌న కామెంట్లు చేస్తున్న నేత‌లు... గెలుపే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌ధాని ప‌ద‌విలో ఉన్న న‌రేంద్ర మోదీతో పాటు కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా, యూపీఏ పీఎం కేండిడేట్ గా బ‌రిలోకి దిగిన రాహుల్ గాంధీ కూడా ఈ తూటాల్లాంటి మాట‌ల‌కు దూరంగా ఉండేది లేద‌ని తేల్చేశారు. ఈ క్ర‌మంలో ఐదో ద‌శ పోలింగ్ కు ఒక్క రోజు ముందుగా న‌రేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య‌లు బీజేపీ, కాంగ్రెస్ ల మ‌ధ్య పోరును తీవ్ర స్థాయికి తీసుకెళ్లాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. దివంగ‌త ప్ర‌ధాని రాజీవ్ గాంధీని కూడా లాగేసిన మోదీ... ఆయ‌న‌ను భ్ర‌ష్ఠాచారీ నెంబ‌ర్ వ‌న్ అంటూ అవినీతి సామ్రాట్ గానే రాజీవ్ చ‌నిపోయారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఘాటుగానే స్పందించింది. అప్ప‌టికే ఐదో ద‌శ పోలింగ్ కు సంబంధించిన ప్ర‌చారం ముగియ‌డంతో ట్విట్ట‌ర్ ద్వారా ఎదురు దాడికి దిగిన రాహుల్‌... మోదీకి క‌ర్మ ఫ‌లం త్వ‌ర‌లోనే అందుతుంద‌ని శాప‌నార్ధాలు పెట్టారు. రాజీవ్ కూతురుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ త‌రఫున స్టార్ క్యాంపెయినర్ గా బ‌రిలోకి దిగిన ప్రియాంకా గాంధీ మ‌రో అడుగు ముందుకేసి మోదీని ఏకంగా దుర్యోధ‌నుడితో పోల్చేశారు. దుర్యోధనుడి మాదిరి మోదీ ఓ దురహంకారి అని, ఆయన అహంకారమే ఆయన ఓటమికి కారణమవుతుందని నిప్పులు చెరిగారు. హర్యానాలోని అంబాలాలో మంగళవారం జరిగిన ర్యాలీలో ప్రియాంక ఈ వ్యాఖ్య‌లు చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు గురించి బీజేపీ నేతలు తమ ప్రసంగాల్లో ఒక్కసారి కూడా ప్రస్తావించిన పాపాన పోలేదని విరుచుకుప‌డ్డారు. కేవలం అమరవీరుల పేరుతోనో, త‌మ‌ కుటుంబానికి చెందిన అమరవీరుడు (రాజీవ్) పేరుతోనో బీజేపీ నేత‌లు ఓట్లడుగుతున్నారని ఎద్దేవా చేశారు.

మోదీని దుర్యోధ‌నుడిగా అభివ‌ర్ణిస్తూ ప్రియాంక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కాసేప‌టికే... మోదీ త‌ర‌ఫున బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా రంగంలోకి దిగిపోయారు. ప్రియాంక వ్యాఖ్య‌ల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన షా... కాంగ్రెస్ పార్టీ ఎంత నైరాశ్యంలో కూరుకుపోయిందో చెప్పేందుకు ప్రియాంక వ్యాఖ్యలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల‌ 23న వెలువడే లోక్‌సభ ఎన్నికల ఫలితాలే ప్రియాంకకు గుణపాఠం చెబుతాయని.... కాంగ్రెస్ ఎన్ని అవమానాలకు గురిచేసినా భారత ఓటర్ల మనసును మార్చలేరని కూడా ఆయ‌న త‌న‌దైన శైలిలో స్పందించారు. అంత‌టితో ఆగ‌ని ఆయ‌న... ఎవరు అర్జునుడో, ఎవరు దుర్యోధనుడో ఈ నెల‌ 23న తేలుతుందని త‌న‌దైన శైలిలో ఎదురు దాడి చేశారు. మొత్తంగా రాజీవ్ గాంధీని మోదీ లాగితే... మోదీపై విరుచుకుప‌డ్డ ప్రియాంక‌కు రిటార్ట్ ఇచ్చేందుకు అమిత్ షా ఎంట్రీ ఇచ్చార‌న్న మాట‌.