Begin typing your search above and press return to search.

తెలంగాణలో కూడా బీజేపీ : అమిత్ షా

By:  Tupaki Desk   |   22 May 2017 5:56 PM GMT
తెలంగాణలో కూడా బీజేపీ : అమిత్ షా
X
తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తదనే నమ్మకం త‌న‌కు ఉంద‌ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్య‌క్తం చేశారు. ఇందుకోసం నాయ‌కుల ప్ర‌ణాళిక‌లు, కార్య‌క‌ర్త‌ల శ్ర‌మ కీల‌క‌మ‌ని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నల్గొండ జిల్లాలో అమిత్‌ షా తెలంగాణ బీజేపీ ఆఫీస్‌ బేరర్లు, బూత్ స్థాయి కార్యకర్తలతో భేటీ అయ్యారు. అనంత‌రం న‌ల్గొండలోనే మేధావుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అమిత్ షా ఉత్సాహ‌పూరిత ప్ర‌సంగం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పటిష్టత కోసమే తన పర్యటన అని తెలిపారు. స‌మ‌ష్టి కృషి చేస్తే రాష్ట్రంలో అధికారం ఖాయ‌మ‌ని వివ‌రించారు.

పార్టీ నేత‌ల స‌మావేశంలో అమిత్ షా మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతం కోసం గాల్లో లెక్కలు కాదు.. చేతల్లో ఆచ‌ర‌ణ‌ చూపాలని పేర్కొన్నారు. పార్టీ ప‌టిష్ట‌త కోసం రోడ్‌ మ్యాప్‌ వేయాలని...అమలు చేయాలని తెలిపారు. ప్రతి 3 నెలలకు ఒకసారైనా తెలంగాణకు వస్తానని స్పష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర బీజేపీ నేతల పోరాటాలపై అమిత్‌ షా అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై సరిగా పోరాడటం లేదంటూ నిలదీశారు. ప్రగతి భవన్‌, 12 శాతం రిజర్వేషన్లు, సీఎం తిరుపతి టూర్‌ పై ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. ఇంట్లో కూర్చుంటే గెలవలేం, ఎవరమూ నాయకులం కాలేమని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. దేశంలో రైతులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కేంద్రంలోని మోడీ సర్కార్ పని చేస్తున్నదని, ఈ బ‌లాన్ని ఉప‌యోగించుకొని పార్టీని విస్త‌రించాలని కోరారు. బీజేపీలో పనిచేసే వారే పదవులను పొందుతారని అమిత్ షా స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశంలో తెలంగాణ నుంచి సమరశంఖం పూరిద్దామని ఆయన పేర్కొన్నారు. బీజేపీలో ఉన్నంత ప్రజాస్వామ్యం ఏ పార్టీలోనూ ఉండదని చెప్పారు. కేంద్రం అమలు చేస్తున్న 106 పథకాలను అమిత్‌ షా చదివి వినిపించారు.

కాగా న‌ల్ల‌గొండ‌లో మేదావులతో సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆసక్తికర చర్చలు జరిపారు. కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే నిధులు దుర్వినియోగం కావని తెలిపారు. మా తప్పులను నిర్భయంగా చెప్పండి సరిదిద్దుకుంటామని అమిత్ షా ప్ర‌తిపాదించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారని అమిత్‌ షా మేధావులను ప్రశ్నించారు. శ్ర‌మించే వారికే ప‌ట్టం క‌డుతామ‌ని ఈ సంద‌ర్భంగా వారికి హామీ ఇచ్చారు.