Begin typing your search above and press return to search.

కేసీఆర్ కాన్ఫిడెన్స్ పై 'షా' సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!?

By:  Tupaki Desk   |   1 Sep 2018 6:00 AM GMT
కేసీఆర్ కాన్ఫిడెన్స్ పై షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!?
X
త‌న ముంద‌స్తు కోరిక‌ను నెర‌వేర్చుకోవ‌టం కోసం ప్ర‌ధాని మోడీ ఆశీస్సుల్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పొందిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా చేసిన ఢిల్లీ టూర్ వెనుక అస‌లు కార‌ణం ముంద‌స్తేన‌ని.. అయితే.. ఎన్నిక‌ల‌కు వెళ్లే ముందు ప్ర‌జ‌ల‌కు తాను కీల‌క అంశాల మీద విజ‌యం సాధించాన‌ని చెప్పుకోవ‌టానికి వీలుగా జోన‌ల్ వ్య‌వ‌స్థ‌పై తాము తీసుకున్న నిర్ణ‌యాన్ని ఓకే చెప్పాల‌ని కోర‌టం.. అందుకు ఓకే చేసిన మోడీ తీరు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీసింది.

త‌మకు కాకుండా వేరే వారికి మైలేజీ వ‌స్తుంటే ఏ మాత్రం స‌హించ‌లేని ప్ర‌ముఖ నేత‌ల్లో మోడీ ఒక‌ర‌ని చెబుతారు. అలాంటి మోడీని కేసీఆర్ ఎలా క‌న్వీన్స్ చేశారు? అన్న ప్ర‌శ్న తెర మీద‌కు వ‌చ్చింది. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో త‌న‌కు సాయంగా ఉంటే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భారీ ఎత్తున సీట్లు సొంతం చేసుకొని.. ఎన్డీయేకు ఫుల్ స‌పోర్ట్ ఇస్తాన‌న్న మాట కేసీఆర్ ఇచ్చిన‌ట్లుగా ఒక మాట రాజ‌కీయ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోంది.

ఇదంతా చూసిన‌ప్పుడు మోడీ-కేసీఆర్ ల మ‌ధ్య ట‌ర్మ్స్ చాలా బ‌లంగా ఉన్న‌ట్లుగా అనిపించ‌క మాన‌దు. రాబోయే రోజుల్లో కాబోయే అధికారిక‌ స్నేహితుల‌న్న ఫీలింగ్ క‌లుగ‌క మాన‌దు. మ‌రి.. ఇలాంటి వేళ‌.. మోడీకి అత్యంత స‌న్నిహితుడిగా వ్య‌వ‌హ‌రించే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రియాక్ష‌న్ ఎలా ఉంది? కేసీఆర్ ముంద‌స్తుపై ఆయ‌న చేసిన‌ట్లుగా చెబుతున్న వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

కేసీఆర్ ఇప్ప‌టివ‌ర‌కూ త‌న నోటి నుంచి ముంద‌స్తు గురించి మాట చెప్పింది లేదు. అయితే.. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు ముంద‌స్తు ఊహాగానాల్ని బ‌ల‌ప‌ర్చేలా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా మంత్రాల‌యం వెళ్లిన అమిత్ షా అంత‌కు ముందు తెలంగాణ బీజేపీ నేత‌ల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం.

ముంద‌స్తు ఎన్నిక‌లు రావ‌టం ఖాయ‌మ‌ని తేల్చి చెప్పిన అమిత్ షా.. వాటిని లైట్ గా తీసుకోవ‌ద్ద‌ని పేర్కొన‌టం గ‌మ‌నార్హం. తాజాగా జోన‌ల్ అంశంపై కేంద్రం ఆగ‌మేఘాల మీద స్పందించిన తీరుపై బీజేపీ నేత‌ల అభ్యంత‌రాల్ని కొట్టి పారేసిన షా.. కేంద్రం ఏం చేసినా తెలంగాణ ప్ర‌యోజ‌నాల కోస‌మేన‌ని స్ప‌ష్టం చేస్తూ.. అదేమీ కేసీఆర్ కోసం కాద‌న్న‌ట్లుగా చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. దేశంలోని 20 రాష్ట్రాల్లో అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు తెలంగాణ‌లో కూడా ఎందుకు రాలేమ‌న్న ప్ర‌శ్న‌ను వేసిన‌ట్లుగా చెబుతున్నారు.

మీ వ్యూహాన్ని త‌యారు చేసి ఇవ్వాల‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ వైఖ‌రి చూస్తే.. ఆయ‌న వెంట‌నే ఎన్నిక‌ల‌కు వెళ్లేట్టుగా ఉన్నార‌ని.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. ఛ‌త్తీస్ గ‌ఢ్‌.. రాజ‌స్థాన్ ల‌పై ఏ స్థాయిలో క‌స‌ర‌త్తు చేస్తున్నామో.. తెలంగాణ‌లో కూడా అంతే స్థాయిలో దృష్టి పెడ‌తామ‌ని చెప్పినట్లుగా చెబుతున్నారు.

కేసీఆర్ కు వంద సీట్లు అసాధ్య‌మ‌ని.. బొటాబొటి మెజార్టీ వ‌స్తే గొప్ప అని చెప్పిన‌ట్లుగా బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మాచారం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. టీఆర్ ఎస్‌.. కాంగ్రెస్ పార్టీల నుంచి ఎవ‌రెవ‌రు బీజేపీలోకి రావ‌టానికి సిద్ధంగా ఉన్నారో మాట్లాడాల‌ని చెప్పిన ఆయ‌న‌.. పార్టీ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని.. లోక్ స‌భ సీట్ల‌కోసం టీఆర్ ఎస్ తో రాజీ ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ఓప‌క్క వంద సీట్లు ప‌క్కా అని కేసీఆర్ బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతుంటే.. బొటాబొటీ మెజార్టీ వ‌స్తే గొప్ప‌ని చెప్పటం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.