Begin typing your search above and press return to search.

కేసీఆర్, మజ్లిస్ ను టార్గెట్ చేసిన అమిత్ షా

By:  Tupaki Desk   |   17 Sep 2021 5:30 PM GMT
కేసీఆర్, మజ్లిస్ ను టార్గెట్ చేసిన అమిత్ షా
X
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్మల్ లో నిర్వహించిన సభ విజయవంతమైంది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. ప్రధానంగా సీఎం కేసీఆర్ , మజ్లిస్ పార్టీలను టార్గెట్ చేశారు. మజ్లిస్ కు బీజేపీ భయపడదని.. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణలో 2024లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు.

తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చానని అమిత్ షా తెలిపారు. నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిన రోజు అని అమిత్ షా అన్నారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణలో ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని కేసీఆర్ ను అమిత్ షా ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమరోజుల్లో కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేస్తానని అన్నారని.. మరి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని అమిత్ షా ప్రశ్నించారు. విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ మరిచిపోయాడని విమర్శించారు.

ఎంఐంఎంతో బీజేపీ మాత్రమే పోరాడగలదని అమిత్ షా చెప్పుకొచ్చారు. ఇవాళ ప్రధాని మోడీ పుట్టినరోజు అని.. ఈ సందర్భంగా రెండు కోట్ల వ్యాక్సిన్ల డోస్ లను ఇస్తున్నామని అమిత్ షా తెలిపారు.

భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత సర్ధార్ వల్లభాయ్ పటేల్ పరాక్రమంతోనే తెలంగాణ భారత్ లో కలిసిందని అమిత్ షా గుర్తు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయని అమిత్ షా ప్రశ్నించారు. తెలంగాణ విమోచన వీరుల బలిదానాలు కేసీఆర్ కు పట్టవా? అని నిలదీశారు.

2019 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు సీట్లు గెలిచిందని.. 2023 ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని సీట్లలో పార్టీ గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్ ను అమిత్ షా ప్రశంసలతో ముంచెత్తారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ ను గెలిపించాలని ప్రజలను అమిత్ షా కోరారు.

ఇక తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. సచివాలయానికి వచ్చే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సభలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

అనంతరం మాట్లాడిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 'తెలంగాణ విమోచన ఉత్సవాలు జరపనందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని' డిమాండ్ చేశారు. పటేల్ లేకుండా అసలు తెలంగాణ వచ్చేది కాదని.. కేసీఆర్ సీఎం అయ్యే వారు కాదని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన ఘనత అమిత్ షాకే దక్కుతుందన్నారు.