Begin typing your search above and press return to search.

సోనియాను టార్గెట్ చేసి షా షాకింగ్ స్కెచ్‌

By:  Tupaki Desk   |   29 July 2017 5:13 AM GMT
సోనియాను టార్గెట్ చేసి షా షాకింగ్ స్కెచ్‌
X
కాంగ్రెస్ పార్టీని బ‌ల‌హీనం చేయ‌డం - ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ పెద్ద‌లు ఆ క్ర‌మంలో మ‌రో కీల‌క వ్యూహాన్ని చివ‌రి క్ష‌ణంలో అమ‌ల్లో పెట్టారు. రాజ్యసభకు ఐదోసారి ఎన్నికయ్యేందుకు రంగంలోకి దిగిన సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ ను ఓడించటం ద్వారా కాంగ్రెస్‌ ను - ఆ పార్టీ అధినేత్రిని నైతికంగా దెబ్బతీసేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్కెచ్ వేశారు. ఇందుకోసం గుజరాత్‌ కు చెందిన అసమ్మతి నాయకుడు శంకర్‌ సింగ్ వాఘేలా కేంద్రంగా పావులు క‌దుపుతున్నారు. గుజరాత్ నుండి రాజ్యసభకు ముగ్గురు అభ్యర్థులను ఎన్నుకునేందుకు చివరి రోజైన శుక్రవారం నాలుగు నామినేషన్లు దాఖలు కావటంతో అహ్మద్ పటేల్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది.

బీజేపీ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా - కేంద్ర సమాచార - జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పక్షాన అహ్మద్ పటేల్ నామినేషన్ వేశారు. అయితే అమిత్ షా పన్నిన వ్యూహం మేరకు కాంగ్రెస్‌ కు రాజీనామా చేసిన బల్వంత్‌ సింగ్ రాజ్‌ పుత్ కూడా నామినేషన్ వేశారు. దీనికితోడు ఇంతవరకు ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ కు రాజీనామా చేశారు. ఈ ఆరుగురిలో ముగ్గురు శాసన సభ్యత్వాలకు రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ఈ ముగ్గురూ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయక పోవటం వల్ల కాంగ్రెస్‌ కు నష్టం తప్పదు. రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు ఒక్కొక్క అభ్యర్థికి నలభై నాలుగు ఓట్లు పడవలసి ఉంటుంది. కాంగ్రెస్ వద్ద ప్రస్తుతం 51 ఓట్లు ఉన్నాయి. వచ్చే నెలలో పోలింగ్ జరిగే నాటికి కాంగ్రెస్ నుండి మరో ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయటం లేదా బల్వంత్ సింగ్ రాజ్‌ పుత్‌ కు అనుకూలంగా ఓటు వేయటం కానీ చేస్తారని అంటున్నారు. ఇదే జరిగితే అమిత్ షా వ్యూహం మేరకు ఆయన, స్మృతి ఇరానీ నేరుగా విజయం సాధిస్తారు. బల్వంత్ సింగ్ రెండో ప్రాధాన్య‌ ఓట్లతో గట్టెక్కవచ్చు. బల్వంత్‌ సింగ్ శంకర్‌ సింగ్ వఘేలాకు వియ్యంకుడు కావటంతో ఆయన విజయానికి వఘేలా రెండో ప్రాధాన్యతా ఓటు సాధించేందుకు వ్యూహరచన చేస్తున్నారు.

అమిత్ షా సూచనలు, సలహాల మేరకు వఘేలా పావులు కదపటం కాంగ్రెస్ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. శుక్రవారం పలువురు పార్టీ సీనియర్ నాయకులతో సోనియా సమావేశమై అహ్మద్ పటేల్ విజయావకాశాలను సమీక్షించినట్లు తెలిసింది. పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఏం చేయాలన్న అంశంపై సమాలోచన జరిపినట్లు ఏఐసీపీ వర్గాలు చెబుతున్నాయి. గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు రానున్న డిసెంబర్‌ లో జరుగునున్నాయి. కాంగ్రెస్‌ లో అత్యంత సీనియర్ నాయకుడైన అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నిక కాకుండా చూడటం ద్వారా గుజరాత్ కాంగ్రెస్‌ ను నీరు కార్చాలన్నది అమిత్ షా లక్ష్యం. గత అసెంబ్లీ ఎన్నికల్లో 121సీట్లు గెలిచింది, ఈసారి ఎన్నికల్లో 150 సీట్లు గెలవాలన్నది అమిత్ షా లక్ష్యం. అందుకే కాంగ్రెస్‌ కు రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే బల్వంత్‌ సింగ్‌ ను బీజేపీలో చేర్చుకుని రాజ్యసభకు పోటీ చేసేందుకు టికెట్ కూడా ఇచ్చారు.