Begin typing your search above and press return to search.

వాళ్లు బీజేపీ కాదంటారా అమిత్ షా?

By:  Tupaki Desk   |   17 May 2019 6:00 PM GMT
వాళ్లు బీజేపీ కాదంటారా అమిత్ షా?
X
ఒకవైపు భారతీయ జనతా పార్టీలోని 'మాటల అతివాద నేతలు' హాట్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. వీళ్లు మాటెత్తితే వివాదాలు రేపుతూ ఉంటారు. ఆఖరికి జాతిపిత గాంధీ మహాత్ముడి హత్యను కూడా పండగలా సెలబ్రేట్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు. గాంధీ మహాత్ముడి హత్య అత్యంత ఆనందకరమైన సమయం అన్నట్టుగా వీళ్లు వ్యవహరిస్తారు.

అంతే గాక రకరకాల థియరీలు చెబుతూ..గాంధీ మహాత్ముడి హత్యను సమర్థిస్తూ ఉంటారు. వీరు సమర్థించడమే కాదు.. దేశమంతా అలా వ్యవహరించాలి అన్నట్టుగా వాదిస్తూ ఉంటారు. గాడ్సేను ఒక గొప్ప దేశ భక్తుడిగా చేసేశారు. గాంధీ కన్నా గాడ్సే గొప్ప దేశ భక్తుడు అన్నట్టుగా వీరు వాదిస్తూ ఉన్నారు.

ఒకరు కాదు ఇద్దరు కాదు.. భారతీయ జనతా పార్టీ నేతల్లో ఎంపీ స్థాయి వ్యక్తులు గాడ్సేను కీర్తిస్తూ వరసగా వివిధ వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. ఎన్నికల వేళ ఇలాంటి ప్రసంగాలతో వీరు ఓట్ల రాజకీయం చేస్తూ ఉన్నారని కూడా స్పష్టం అవుతూ ఉంది.

గాడ్సేను పొగుడుతూ, గాంధీని కించపరస్తూ, గాంధీ తప్పులు చేశారని ప్రచారం చేస్తూ.. వీర జాతీయ వాదుల ఓట్లను పొందాలనే ప్రణాళికలను వీరు అమలు పరుస్తూ ఉన్నారనేది బహిరంగ రహస్యమే.

ఇలా బీజేపీ నేతలు రచ్చలు రాజేస్తూ ఉన్నారు. ఈ అంశం గురించి భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. ఈయన తీరు మరింత విడ్డూరంగా ఉంది.

గాడ్సే విషయంలో వ్యాఖ్యలు చేసిన అనంత్ కుమార, సాధ్వీ ప్రగ్యా సింగ్.. తదితరుల కామెంట్లతో భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదని అమిత్ షా ప్రకటించుకొచ్చారు. బీజేపీ నేతలు, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థులు చేసిన కామెంట్లతో ఆ పార్టీకే సంబంధం లేదట! ఇదీ బీజేపీ జాతీయాధ్యక్షుడి తీరు.

వారి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో కట్టె విరగకుండా, పాము చావకుండా అమిత్ షా మాట్లాడుతున్నారని స్పష్టం అవుతోంది. వివాదాస్పదన వ్యాఖ్యలు చేసిన తన పార్టీ నేతలను ఏమనేది ఉండదు. వారి వ్యాఖ్యలను ఖండించడమూ ఉండదు. వారి వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదంటూ.. అమిత్ షా లౌక్యాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా ఉన్నారని పరిశీలకులు అంటున్నారు!