Begin typing your search above and press return to search.

`షా` వారి.. `తిరుప‌తి షో`.. ఫ్లాపా? హిట్టా?..!

By:  Tupaki Desk   |   14 Nov 2021 4:30 PM GMT
`షా` వారి.. `తిరుప‌తి షో`.. ఫ్లాపా? హిట్టా?..!
X
ఏపీ ప్ర‌భుత్వం అస‌లే అప్పుల్లో ఉంది. అయిన‌ప్ప‌టికీ.. ద‌క్షిణ ప్రాంతీయ మండ‌లి.. స‌మావేశానికి ఆతిధ్యం ఇచ్చింది. తిరుప‌తిలో జ‌రిగిన ఈ స‌మావేశానికి సుమారు 25 కోట్ల వ‌ర‌కు తాజ్ హోట‌ల్ బిల్లు వేసింద‌ని.. తెలుస్తోంది. మ‌రి ఇంత ఖ‌ర్చు చేసి.. ఏం సాధించింది? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఈ స‌మావేశాన్ని మొత్తంగా.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంది. రాష్ట్ర స‌మ‌స్య‌ల‌ను ఏక‌రువు పెట్టింది. కేంద్ర హోం మంత్రి.. కేంద్రంలో నెంబ‌ర్ 2గా ఉన్న అమిత్ షా ముందు.. స్వ‌యంగా సీఎం జ‌గ‌న్ స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు.

అయితే.. ఆయా స‌మ‌స్య‌ల‌పై మ‌రి అమిత్ షా రియాక్ట్ అయ్యారా? క‌నీసం వాటిని ప్ర‌స్తావించారా? అంటే.. పెద‌వి విరుపే క‌నిపిస్తోంది. మొత్తం.. ద‌క్షిణ ప్రాంతీయ మండ‌లి స‌మావేశంలో షా వారి షో.. అంతా మోడీ భ‌జ‌నకే ప‌రిమిత‌మైంది. ఎన్నో ఆశ‌ల‌తో వ‌చ్చిన .. ఇత‌ర రాష్ట్రాలు కూడా.. త‌మ స‌మ‌స్య‌ల‌కు ఎలాంటి ప‌రిష్కారం ల‌భించ‌క‌పోవ‌డంతో మొహాల్లో ఎక్క‌డా క‌ళ క‌నిపించ‌లేదు.

షా.. మాట‌లు ఇవీ..

దక్షిణ భారతదేశ రాష్ట్రాల ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు భారతదేశ సంస్కృతిని ప్రాచీన వారసత్వాన్ని సుసంపన్నం చేసాయి. దక్షిణ రాష్ట్రాల సహకారం లేకుండా భారతదేశ అభివృద్ధిని ఊహించలేము.

మోడీ ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రాంతీయ భాషలను గౌరవిస్తుంది. నేటి దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో దక్షిణ జోనల్ కౌన్సిల్‌లో ఉన్న అన్ని భాషల్లోకి అనువదించే వెసులుబాటు కలిగింది. భవిష్యత్‌లో మండలి సభ్యులు వారి స్వభాషలో మాట్లాడేందుకు మొగ్గు చూపితే సంతోషపడతా.

కోవిడ్ -19 మహమ్మారిని నియంత్రించేందుకు మనం 111 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను సాధించగలిగాము. ఇది గొప్ప విజయం సహకార సమాఖ్యవాదానికి ఉదాహరణ. దేశంలో సర్వతోముఖాభివృద్ధిని సాధించేందుకు సహకార, పోటీతత్వ సమాఖ్యవాదాన్ని పెంపొందించాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దార్శనికత.

మహమ్మారి వ‌చ్చినప్పుడు.. భారతదేశం దాని తీవ్రతను తట్టుకోలేదని అనుకున్నారు. అయినప్పటికీ, ప్రధాన మంత్రి మోడీ నాయకత్వంలో భారతదేశం తన ఆరోగ్య మౌలిక సదుపాయాలతో పాటు దేశీయంగా వ్యాక్సిన్‌ల ఉత్పత్తిని త్వరగా వేగవంతం చేసింది. ఈ రోజు, మనం మహమ్మారి భయాన్ని అధిగమించాం. టీకా కార్యక్రమం ద్వారా అన్ని రాష్ట్రాలకు లబ్ది చేకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.

ప్రాంతీయ మండళ్ళు నిర్మాణాత్మకంగా సలహా సంఘాలు. వీటి సహకారంతో అనేక సమస్యలను విజయవంతంగా పరిష్కరించగలిగాము. సభ్యుల మధ్య అత్యున్నత స్థాయిలో పరస్పర చర్చలకు ప్రాంతీయ మండళ్ళు అవకాశం కల్పిస్తాయి. గత 7 సంవత్సరాలలో 18 మండల పరిషత్తుల సమావేశాలను నిర్వహించాం. ఇంతకు ముందు చాలా తక్కువ సమావేశాలు జరిగేవి.

కంక్లూజ‌న్‌..

మొత్తంగా స‌మావేశంలో.. అమిత్ షా 12 -15 నిముషాలు మాత్ర‌మే మాట్లాడారు. దీనిలోనూ మోడీపై ప్ర‌శంస‌లు.. కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌ల‌తోనే ఆయ‌న స‌రిపుచ్చారు త‌ప్ప‌.. ఎక్క‌డా.. ఏపీ సీఎం జ‌గ‌న్ చెప్పిన స‌మ‌స్య‌ల‌పై ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు. పైగా.. ఆయ‌న అస‌లు వ‌చ్చిన స‌మావేశం తాలూకు నేప‌థ్యాన్ని ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిపై .. రాజ‌కీయ నేత‌లు ఎలా కామెంట్లు చేస్తారో చూడాలి.