Begin typing your search above and press return to search.

అమిత్ 'షా' పేరు మార్చుకోవాలట.. బీజేపీ నోట మాట రాలేని రీతిలో లాజిక్

By:  Tupaki Desk   |   5 Jan 2022 6:39 AM GMT
అమిత్ షా పేరు మార్చుకోవాలట.. బీజేపీ నోట మాట రాలేని రీతిలో లాజిక్
X
నిద్ర లేచింది మొదలు ఆ పేరు మార్చాలి. ఈ పేరు మార్చాలి. దాన్ని కూల్చేయాలి. దీన్ని నేలమట్టం చేయాలి.. అంటూ ఆవేశంతో చెలరేగిపోతూ వాదనలు వినిపించే బీజేపీ పరివారం నోటి వెంట మాట రాలేని రీతిలో సరికొత్త లాజిక్ ఒకటి తెర మీదకు వచ్చింది. ఈ మధ్యనే గుంటూరు జిన్నా టవర్ పేరు మార్చాలని.. విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి పేరు మార్చాలన్న మాటలతో పాటు హైదరాబాద్ పేరును భాగ్యనగరిగా మార్చాలన్న డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ డిమాండ్లపై రోటీన్ కు భిన్నంగా స్పందించింది దక్కన్ హెరిటేజ్ ట్రస్టు.

తాజాగా వారు సమావేశాన్ని ఏర్పాటు చేసి.. తమ వాదనను వినిపించారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని ప్రకటిస్తున్న బీజేపీ నాయకులు.. ముందుగా తమ జాతీయ నాయకుడు అమిత్ షా పేరులోని పార్శీ పదమైన ‘‘షా’’ను తొలగించుకోవాలని కోరుతున్నారు. అంతేకాదు.. ఇస్లాం రాజుల మనుగడలో వచ్చిన షేర్వాణీ.. కుర్తా.. పైజమాలను బీజేపీ.. ఆర్ఎస్ఎస్ నేతలు ధరించకూడదని చెప్పారు. నిజమే.. వారి వాదనలోనూ ధర్మం ఉంది కదా?
విదేశీ వలసరాజులు.. అందునా మతాల వారీగా లెక్కలు తీసి.. వారి ముద్ర మన మీద ఎందుకు ఉండాలని వాదనలు వినిపించే కమలనాథులు దక్కన్ హెరిటేజ్ ట్రస్టు వారి మాటలకు ఏం చెబుతారు? అంతేకాదు.. మరో ఆసక్తికరమైన అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలని అంటారని.. అసలు భాగమతి ప్రేమ కథ మొత్తం ఒక కట్టుకథగా కొట్టిపారేశారు.

భాగమతి ప్రేమ కథ ఒక కట్టుకథ అని.. అందుకు ప్రఖ్యాత చరిత్రకారుడు హరూన్ ఖాన్ షెర్వాణీ రచించిన హిస్టరీ ఆఫ్ మిడీవల్ దక్కన్ పుస్తకం ఒక సాక్ష్యమని పేర్కొన్నారు. కుతుబ్ షాహీల నాణేలలోనూ ఎక్కడా భాగ్యనగర్ పేరు కనిపించదని వారు చెబుతున్నారు. మహ్మద్ కులీ రాసిన కుల్లీయత్ కవిత్వంలో తన పదిహేడు మంది భార్యల గురించి రాశాడని.. అందులో ఎక్కడా భాగమతి పేరు కనిపించదని చెబుతున్నారు. మహ్మమద్ కులీ.. భాగమతి అనే మహిళను ప్రేమించి.. పెళ్లాడినట్లుగా రాసి పౌజీ.. నిజాముద్దీన్.. ఫెరిస్తాలు ఎప్పుడూ హైదరాబాద్ మహానగరాన్ని సందర్శించలేదంటూ సంచలన అంశాల్నిప్రస్తావించారు దక్కన్ హెరిటేజ్ ట్రస్టు సభ్యులు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అమిత్ షా పేరులోని పార్శీ పదాన్ని తెర మీదకు తెచ్చిన వైనం కమలనాథులకు కొత్త ఇబ్బందిని తెచ్చి పెడుతుందన్న మాట వినిపిస్తోంది.