Begin typing your search above and press return to search.

వాజ్ పేయ్ బంగ్లాను షాకు ఇచ్చేశారు!

By:  Tupaki Desk   |   7 Jun 2019 4:30 PM GMT
వాజ్ పేయ్ బంగ్లాను షాకు ఇచ్చేశారు!
X
బీజేపీలో ఎవ‌రికి ద‌క్క‌నంత ప్ర‌యారిటీ పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షాకు ద‌క్కుతోంది. ప్ర‌ధాన‌మంత్రి మోడీకి అత్యంత స‌న్నిహితుడిగా.. ఆయ‌న‌కు నీడ‌గా అభివ‌ర్ణించే షా.. పార్టీలోనూ.. ప్ర‌భుత్వంలోనూ మోడీ త‌ర్వాత నెంబ‌ర్ 2 అన్న విష‌యాన్ని తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాలు స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే.

మొన్న‌టివ‌ర‌కూ మోడీ త‌ర్వాతి స్థానం రాజ్ నాథ్ కు ఉండేది. తాజాగా ఆ విష‌యంలో లెక్క‌లు మారిపోయిన విష‌యం స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ధ్య‌న ముగిసిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అద్వానీ బ‌రిలో దిగే గాంధీ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆయ‌న‌కు కేటాయించ‌కుండా అమిత్ షాకు అప్ప‌జెప్ప‌టం తెలిసిందే.

తాజాగా కేంద్ర‌మంత్రి హోదాలో అమిత్ షాకు అధికారులు కేటాయించిన బంగ్లా లెక్క తెలిస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. బీజేపీకి పిల్ల‌ర్ గా.. బీజేపీకి స‌రికొత్త ఇమేజ్ క‌ట్ట‌బెట్టిన మాజీ ప్ర‌ధాని దివంగ‌త వాజ్ పేయ్ నివాసం ఉన్న కృష్ణ మీన‌న్ మార్గ్ బంగ్లాను కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి అనంత‌రం.. మాజీ ప్ర‌ధాని హోదాలో వాజ్ పేయ్ కు ఆ బంగ్లాను 2004లో కేటాయించారు.

అప్ప‌టి నుంచి ఆయ‌న మ‌ర‌ణించే వ‌ర‌కూ అదే బంగ్లాలో ఆయ‌న నివాసం ఉన్నారు. ఇటీవ‌ల వాజ్ పేయ్ మ‌ర‌ణించిన అనంత‌రం.. ఆ బంగ్లాకు మ‌ర‌మ్మతులు చేశారు. త్వ‌ర‌లో ఆ ఇంట్లోకి అమిత్ షా గృహ‌ప్ర‌వేశం చేస్తార‌ని అధికారులు చెబుతున్నారు. ఆసక్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. అద్వానీ నియోజ‌క‌వ‌ర్గాన్ని.. వాజ్ పేయ్ నివాసాన్ని ఏక‌కాలంలో సొంతం చేసుకున్న నేత‌గా షాను అభివ‌ర్ణించాలి. రానున్న రోజుల్లో మ‌రింకేం సొంతం చేసుకుంటారో చూడాలి.