Begin typing your search above and press return to search.

అమిత్ షా చెప్తేనే...అసెంబ్లీ సీట్ల పెంపు

By:  Tupaki Desk   |   12 July 2017 6:05 AM GMT
అమిత్ షా చెప్తేనే...అసెంబ్లీ సీట్ల పెంపు
X
తెలుగు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులైన చంద్ర‌బాబు నాయుడు - చంద్ర‌శేఖ‌ర్ రావు అత్యంత‌ ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్న అంశం...అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌. జంప్ జిలానీల‌ను ప్రోత్స‌హించ‌డం మొద‌లుకొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే వ‌ర‌కు ఈ అస్త్రాన్ని వాడుకునే ఇద్ద‌రు సీఎంలు ఇప్ప‌టివ‌ర‌కు ముందుకు పోతున్నారు. అయితే ఈ విష‌యం ఊహించ‌ని మలుపు తిరిగింద‌ని స‌మాచారం. తెలంగాణ‌ - ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అంశం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వద్దకు చేరిందని ఢిల్లీకి చెందిన విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.

అసెంబ్లీ సీట్ల పెంపుపై విస్తృతంగా అధ్యయనం చేసిన కేంద్ర హోంశాఖ ఇందుకు పచ్చజెండా ఊపింది. త్వరలోనే ఈ విషయాన్ని ప్రధాని మోడీ కూడా సమీక్షించనున్నారు. అయితే రెండు రాష్ర్టాల్లోని బీజేపీ నాయకత్వాలు సీట్ల పెంపును వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే అమిత్‌ షా ఇరురాష్ర్టాల నేతలను ఢిల్లీ పిలిపించి ప్రతిష్ఠంబన తొలిగిస్తారని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ అంశంమీద బీజేపీ ఒక `రాజకీయ నిర్ణయం` తీసుకోగానే బిల్లు రూపకల్పన ప్రారంభమవుతుందని స్ప‌ష్టం చేస్తున్నారు.. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబంధించి కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ పంపిన ఫైల్‌ను కేంద్ర హోం మంత్రిత్వశాఖలోని శాసన వ్యవహారాల విభాగం, కేంద్ర-రాష్ట్ర సంబంధాల విభాగం అధ్యయనం చేసింది. రాజ్యాంగంలోని 170వ అధికరణంలోని మూడవ సబ్ క్లాజ్‌ కు స్వల్ప సవరణలు చేయడం ద్వారా వీలు కల్పించవచ్చని అభిప్రాయపడింది.

ఇరు రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య ను పెంచడానికి కేంద్రం సుముఖంగా ఉన్నా ఏపీ - తెలంగాణ బీజేపీ నాయకత్వాలు సీట్ల సంఖ్య పెంచవద్దని పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా వద్ద అడ్డుపుల్లలు వేస్తున్నాయని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు - రాజ్‌ నాథ్‌ సింగ్ - అరుణ్‌ జైట్లీ త్వరలోనే అమిత్‌ షాను కలిసి దీనిపై చర్చించే అవకాశం ఉంది. దీనిపై రాజకీయ నిర్ణయం జరిగిన వెంటనే రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీపీఏ)లో చర్చించి ఆమోదం లభించగానే కేంద్ర హోం మంత్రిత్వశాఖ బిల్లును రూపొందించి పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తాజా పరిణామాల నేప‌థ్యంలో బీజేపీ ర‌థ‌సార‌థి ఎలాంటి నిర్ణ‌యం తీసుకోనున్నార‌నే ఆస‌క్తి ఇద్ద‌రు సీఎంల‌తో పాటు తెలుగు రాష్ట్రాల‌లోని రాజ‌కీయ నాయ‌కుల్లో క‌లుగుతోంద‌ని అంటున్నారు.