Begin typing your search above and press return to search.

ఏపీలో అమిత్ షా ప‌ర్య‌ట‌న‌.. రోడ్ మ్యాప్ ప్ర‌క‌ట‌నేనా?

By:  Tupaki Desk   |   4 Jan 2023 10:58 AM GMT
ఏపీలో అమిత్ షా ప‌ర్య‌ట‌న‌.. రోడ్ మ్యాప్ ప్ర‌క‌ట‌నేనా?
X
తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చి తీరుతామ‌ని చెబుతున్న బీజేపీ.. ఇప్పుడు ఏపీపైనా దృష్టి పెట్టింది. ఏపీ లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాక‌పోయినా.. త‌ర్వాత వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. పార్టీకి ప‌ట్టు పెంచుకుని.. అధికారం లోకి రావాల‌నేది క‌మ‌ల నాథుల వ్యూహంగా ఉంది. ఈ క్ర‌మంలోనే బీజేపీ వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో ముందుకు సాగుతోంద‌నేది తెలిసిందే. ఇక‌, ఇప్పుడు కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ కీల‌క నాయ‌కుడు అమిత్ షా ఏపీలో ప‌ర్య‌ట‌న ప్రాధాన్యం సంత‌రించుకుంది.

కొత్త సంవ‌త్స‌రం తొలి వారంలోనే షా.. ఏపీ ప‌ర్య‌ట‌న పెట్టుకున్నారు. అయితే.. అనివార్య కార‌ణాల‌తో ఇది వాయిదా ప‌డింది. దీంతో ఈ ప‌ర్య‌ట‌న రెండోవారంలో ఉంటుంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఏపీలో షా ఏం చేయ‌నున్నార‌నేది ఆస‌క్తిగా మారింది. పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేయ‌డం ఆయ‌న కీల‌కంగా భావిస్తున్నారు. ఈ నెల 8న ఏపీకి వ‌చ్చే ఆయ‌న రెండు జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు.

తొలుత క‌ర్నూలు జిల్లాకు చేరుకు షా.. అక్క‌డ పార్టీ నేత‌ల‌తో భేటీ అవుతారు. రాష్ట్రంలో ఎలా ముందుకు సాగాల‌నే విష‌యంపై వారికి దిశానిర్దేశం చేయ‌నున్నారు. అదేవిధంగా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తోనూ ఆయ‌న స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. అనంత‌రం. స‌త్య‌సాయి జిల్లాకు చేరుకుని.. అక్క‌డ విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం.. అక్క‌డ కూడా పార్టీనేత‌ల‌తో భేటీ అవుతారు. స‌త్య‌సాయి స‌మాధిని ద‌ర్శించుకుంటారు.

ఈ క్ర‌మంలో ఏపీలో బీజేపీ అనుస‌రించే వ్యూహంపై షా.. ఒక రోడ్ మ్యాప్‌ను పార్టీ నాయ‌కుల‌కు అందిస్తా ర‌ని తెలుస్తోంది. ప్ర‌ధానంగా ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ద‌న్న ఊహాగానాల నేప‌థ్యంలో షా ప‌ర్య‌ట‌న‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఇక‌, షా ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధానంగా మూడు అంశాల‌ను ప్ర‌స్తావించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

1) వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులు. ఇప్ప‌టికే పార్టీ జ‌న‌సేన‌తో పొత్తులో ఉంది. ఈ విష‌యంలో ఎలాంటి క్లారిటీ ఇస్తారు. ఇక‌, వ‌చ్చే సారి టీడీపీతో పొత్తు పెట్టుకునే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు? అనేది షా చెప్ప‌నున్న‌ట్టు తెలుస్తోంది.

2) మూడురాజ‌ధానుల విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తార‌నేది కూడా ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు .. రాజ‌ధానుల అంశాన్ని బీజేపీ ప్ర‌క‌టించ‌లేదు. గ‌తంలో న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కు రైతులు పాద‌యాత్ర చేసిన‌ప్పుడు.. దానిలో పాల్గొనాలనిషా పార్టీ నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు. దీనిని బ‌ట్టి.. అమ‌రావ‌తికే బీజేపీ క‌ట్టుబ‌డిన‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఏం చెబుతారో చూడాలి.

3) వ‌చ్చేఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు ఏం చేయాల‌నే విష‌యంపైనా అమిత్ షా దిశానిర్దేశం చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. వైసీపీ ప్ర‌భుత్వ అవినీతి, అక్ర‌మాలు, ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లాల‌నే వ్యూహాన్ని ఆయ‌న చెప్ప‌నున్న‌ట్టు స‌మాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.