Begin typing your search above and press return to search.

టీ బీజేపీ..వాపు కాదు..బ‌లుపు కానేకాదు

By:  Tupaki Desk   |   5 Feb 2018 5:14 AM GMT
టీ బీజేపీ..వాపు కాదు..బ‌లుపు కానేకాదు
X

బీజేపీ తెలంగాణ శాఖ‌... కొత్త రాష్ట్రంలో ఈ విభాగం బ‌ల‌ప‌డుతోంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు కొద్దికాలం క్రితం వ‌ర‌కు అంచనా వేశాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఎదుగుతోంద‌ని భావించాయి. అయితే ఇప్పుడు ఆ అంచ‌నాలు నిజం కాద‌నే పరిస్థితులు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు. ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున తమపార్టీలోకి నేతలు వస్తున్నారని ప్రచారం చేసుకుంటున్న రాష్ట్ర బీజేపీకి స్వంత పార్టీ నేతలే వరుస షాక్‌లు ఇస్తుండ‌టం నిద‌ర్శ‌నంగా చెప్తున్నారు. 2019లో రాష్ట్రంలో అధికారం మాదే అని ప్రకటించుకుంటున్న ఆపార్టీకి ఈ గుడ్‌ బై లు తలనొప్పిగా మారాయి. ఇతర పార్టీల నుంచి చేరికల సంగతి దేవుడెరుగు...ఉన్న నేతల్ని ఎలా కాపాడుకోవాలనే సందిగ్థంలో పార్టీ నాయకత్వం తలమునకల‌వుతోందని అంటున్నారు.

గ‌త నెల‌లో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి బీజేపీకి రాం...రాం...చెప్పడం బీజేపీ నేత‌ల‌ను షాక‌య్యేలా చేసింది. ఆపార్టీకే చెందిన సీనియర్‌ నాయకుడు - మాజీ మంత్రి నాగం జనార్థన్‌ రెడ్డి ఉగాది తర్వాత బీజేపీని వీడుతానని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా అదే పార్టీకి చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి - కరీంనగర్‌ నేత బండి సంజయ్‌ బీజేపీకి గుడ్‌ బై చెప్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం తీవ్ర తర్జన భర్జనలు పడుతోంది. అయితే పార్టీ రాజ‌కీయాలే బీజేపీని ఇర‌కాటంలో ప‌డేస్తున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

రాష్ట్ర అధికార ప్ర‌తినిధి బండి సంజయ్‌ రాజీనామాతో పార్టీలో ఆధిపత్యపోరు మరోసారి బహిర్గతమైంది. బండి సంజయ్‌ కరీంనగర్‌ జిల్లాకు చెందిన వారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు - రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి కూడా అదే జిల్లాకు చెందిన వారు. వీరు తమ అనుచరుడు - పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డిని ప్రోత్సహిస్తూ...సంజరును చిన్న చూపు చూస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే శ్రీనివాసరెడ్డికి - సంజయ్‌ కు మధ్య కొద్దికాలంగా విభేదాలు పెరిగాయి. ఇటీవలి కాలంలో ఇవి మరింత ముదిరి, పార్టీ కార్య క్రమాలకు సంజయ్‌ ను ఆహ్వానించట్లేదు. ఇవే విషయాల్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ కె లక్ష్మణ్‌ కు మొరపెట్టుకోవాలని సంజయ్ శనివారం రాత్రి కార్యకర్తలతో కలిసి హైదరాబాద్‌ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఆదివారం సంజయ్ చెప్పిందంతా విన్న లక్ష్మణ్‌...పార్టీలో సర్దుకుపోవాలని - మరోసారి సమస్యలు రాకుండా చూస్తానని చెప్పుకొచ్చారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని సంజయ్‌ అక్కడికక్కడే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అదే విషయాన్ని అక్కడే మీడియాకు కూడా చెప్పారు. జిల్లా రాజకీయాలు తనను తీవ్రంగా బాధిస్తున్నాయని, అక్కడి పరిస్థితుల గురించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పుకుందామని వస్తే...అవమానకరంగా మాట్లాడారని ఆయ న చెప్పుకొచ్చారు. పార్టీకి రాజీనామా చేసానని, రాజకీయాల నుంచే తప్పు కుంటున్నానని ఆయన ప్రకటించారు.

అయితే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు లక్ష్మణ్ మాత్రం ఈ ఎపిసోడ్‌ పై తేలిక‌గా స్పందించారు. ఇదంతా 'టీ కప్పులో తుఫాను' లాంటిదని కొట్టివేశారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న 'గుడ్‌ బై'ల పర్వంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఇతర పార్టీల నుంచి వలసల్ని ప్రోత్సహించి - పార్టీని బలోపేతం చేసుకొనే సంగతి ఎలా ఉన్నా... 'కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు' రాష్ట్ర పార్టీ పరిస్థితి తయారైందని అంటున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణపై పెట్టుకున్న ఆశలు నెరవేరే పరిస్థితులు కనిపించట్లేదని చెప్తున్నారు. ఈ పరిణామాలపై బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌ షా కూడా ఆరా తీసినట్టు సమాచారం. ఆయన ఇటీవల బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని సుతిమెత్తగానే హెచ్చరించినట్టు తెలిసింది.