Begin typing your search above and press return to search.

అందుకే కేసీఆర్ కు షా వెల్ కం చెబుతున్నారా?

By:  Tupaki Desk   |   1 May 2018 3:30 PM GMT
అందుకే కేసీఆర్ కు షా వెల్ కం చెబుతున్నారా?
X
ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరంటూ సినీ క‌వి అప్పుడెప్పుడో చెప్పారు. కానీ.. అది నిజం కాదు. ఆడ‌వారి మాట‌ల కంటే లోతుగా చెప్పే త‌త్త్వం రాజ‌కీయ నాయ‌కుల్లో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. వారి మాట‌ల్లో ప‌లికే మ‌ర్మం ఎంతో జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే మాత్ర‌మే క‌నిపిస్తుంది. రాజ‌కీయ నేత‌ల ముందు ఆడ‌వారి మాట‌లు పెద్ద విష‌య‌మే కాదు. మ‌న‌సులో ఉన్న దానికి భిన్న‌మైన మాట‌ల్ని అల‌వోక‌గా చెప్పే స‌త్తా రాజ‌కీయ‌నేత‌ల సొంతం.

తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ మ‌ధ్య‌న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ కొత్త నినాదాన్ని తెర మీద‌కు తీసుకొచ్చారు. రాష్ట్రాల‌కు ఎక్కువ అధికారాలంటూ పెద్ద పెద్ద మాట‌ల్ని చెబుతున్న ఆయ‌న త‌న మాట‌ల‌కు పాజిటివ్ గా స్పందించే వీలున్న రాష్ట్రాల‌కు వెళ్లి... అక్క‌డి రాజ‌కీయ ప‌క్ష నేత‌ల్ని క‌లుస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే కోల్ క‌తా.. బెంగ‌ళూరు.. చెన్నై వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌రికొద్ది రోజుల్లో ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ ను క‌ల‌వ‌నున్న విష‌యం తెలిసిందే.

బీజేపీ.. కాంగ్రెస్ ల‌కు ప్ర‌త్యామ్నాయంగా వేదిక‌ను తెర మీద‌కు తీసుకురావ‌ట‌మే త‌న లక్ష్య‌మ‌ని చెబుతున్న కేసీఆర్.. హైద‌రాబాద్ కేంద్రంగా దేశ రాజ‌కీయాల్లో భూకంపం సృష్టిస్తానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీని.. కాంగ్రెస్ పై విమ‌ర్శ‌లు రువ్వుతున్న కేసీఆర్ పై బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా రియాక్ట్ అయిన తీరు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఎక్క‌డైనా పోటీగా కొత్త‌వారు బ‌రిలోకి వ‌స్తున్నారంటే.. ఆ వెంట‌నే ఎదురుదాడి మొద‌ల‌వుతుంటుంది. రాజ‌కీయాల్లో అది మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. ఈ లెక్క‌న బీజేపీ.. కాంగ్రెస్ ల‌కు వ్య‌తిరేకంగా తాను కూట‌మిని జ‌ట్టుక‌డ‌తాన‌ని కేసీఆర్ పెద్ద ఎత్తున మాట్లాడుతుంటే.. ఆయ‌న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పై అమిత్ షా సానుకూలంగా రియాక్ట్ కావ‌టంపై ప‌లువురు విస్మ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌ కు తాను హృద‌య‌పూర్వ‌కంగా ఆహ్వానిస్తున్న‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్యానించారు. గ‌తంలోనే ఇదే రీతిలో కొన్ని ఫ్రంట్ లు ఏర్ప‌డి ప్ర‌భుత్వాలు మ‌ద్ద‌తు ఇచ్చిన విష‌యాన్ని షా గుర్తు చేశారు.

షా వ్యాఖ్య‌ల‌పై సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డి ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేశారు. కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌ను స్వాగ‌తించ‌టం వెనుక తెర వెనుక ఒప్పందాలు ఉండి ఉంటాయ‌న్న సందేహాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ వినిపిస్తున్న వాద‌న‌లు క‌చ్ఛితంగా బీజేపీకి ల‌బ్థి చేకూరుస్తాయ‌ని ఆయ‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. సెక్యుల‌ర్ ఓట్ల‌ను చీల్చేలా వ్యూహం ప‌న్నార‌ని.. అందులో భాగంగానే కేసీఆర్ వ్యాఖ్య‌లు ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పై అమిత్ షా సాఫ్ట్ గా మాట్లాడుతున్నార‌ని చెప్పారు. లాజిక్ గా చూస్తే.. సుర‌వ‌రం చెప్పిన పాయింట్లో లెక్క ఉన్న‌ట్లే. మ‌రి.. షా క‌మ్‌కేసీఆర్ క‌లిసిపోయారా? అన్న ఆరోప‌ణ‌పై కాలం స‌రైన స‌మాధానం చెబుతుంద‌న‌టంలో సందేహం లేదు.