Begin typing your search above and press return to search.

ఆరెస్సెస్‌ ను కాకుండా..లాలూను తిడతారెందుకు?

By:  Tupaki Desk   |   4 Oct 2015 1:41 AM GMT
ఆరెస్సెస్‌ ను కాకుండా..లాలూను తిడతారెందుకు?
X
కులాలే కొలబద్ధగా ఓటు బ్యాంకు రాజకీయాలు నడిచే బీహార్‌ ఎన్నికల సమయంలోనే కేంద్రంలోని భాజపా సర్కారును ఇరుకున పెట్టేలా .. దేశంలో రిజర్వేషన్‌ వ్యవస్థను సమీక్షించబోతున్నట్లు ఆరెస్సెస్‌ ఇటీవల ఒక ప్రకటన చేసి పెద్ద సంచలనాన్నే సృష్టించింది. రాజ్యాంగనిర్మాత అంబేద్కర్‌ ఆలోచన ప్రకారమే రిజర్వేషన్లు అనేవి కలకాలం ఉండాల్సిన అవసరం లేనేలేదని.. వాటిని సమీక్షించి తొలగించాల్సిన అవసరం ఉన్నదని అర్థం వచ్చేలా ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ వివాదాస్పదమైన ఈ ప్రకటన ద్వారా వార్తల్లోకి వచ్చారు. ఆరెస్సెస్‌ అనేది.. మోడీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వానికి వెనుక నిలబడి పగ్గాలు చేతపట్టుకుని నడిపిస్తూ ఉంటుందని అందరికీ తెలుసు.

అయితే మోహన్‌ భగవత్‌ చేసిన ఈ ప్రకటన.. సహజంగానే బీహార్‌ ఎన్నికల బరిలో ఒక పెను దుమారాన్ని సృష్టించింది. భాజపాకు ఓట్లు వేస్తే.. వారు రిజర్వేషన్ లు రద్దు చేసేసే ప్రమాదం ఉన్నదంటూ.. ప్రతిపక్షాలు ఒక రేంజిలో వారిని ఆడుకున్నాయి. ప్రజల మనస్సుల్లో అనుమానాల్ని నాటడానికి ప్రయత్నించాయి. అప్పటినుంచి భాజపా తరఫున ప్రచారానికి వెళ్లిన ప్రతినాయకుడు.. 'రిజర్వేషన్లు ఇప్పుడున్నట్టే కొనసాగుతాయని, వాటిని రద్దు చేసే ఆలోచనే లేదని - ఆరెస్సెస్‌ చేసిన ప్రకటన.. వారి సొంత ఆలోచన అని, దానితో ప్రభుత్వానికి సంబంధం లేదని' ప్రతిచోటా టముకు వేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఏ చిన్న మీటింగులోనైనా సరే ఈ మాట చెప్పకుంటే.. ఓట్లు గల్లంతవుతున్నాయని ప్రచారానికి వెళ్లిన ప్రతినేతా భయపడుతున్నారు.

భాజపా జాతీయ చీఫ్‌ అమిత్‌ షా మాట్లాడుతూ.. రిజర్వేషన్ల విషయంలో లాలూప్రసాద్‌ - నితీశ్‌ కుమార్‌ లు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ వారిని నిందిస్తున్నారు. అయినా రిజర్వేషన్ల విషయంలో మోడీ సర్కారుపై ప్రజల్లో అనుమానాలు పుట్టడానికి ప్రధాన కారణమైన ఆరెస్సెస్‌ను వదిలేసి.. ప్రత్యర్థులు కదాని... లాలూను - నితీశ్‌ ను తిట్టడం ఏంటో జనానికి అర్థం కావడం లేదు. రిజర్వేషన్లను సమీక్షించాలంటూ.. వివాదస్పద స్టేట్ మెంట్‌ ఇచ్చినందుకు ఆరెస్సెస్‌ వైఖరిని బహిరంగంగా ఖండించి, వారు తప్పు చేశారని చెబితే తప్ప నితీశ్‌ లేదా మోడీ మాటలను ఈ విషయంలో ప్రజలు నమ్మకపోవచ్చు. అసలు వివాదానికి కారణమైన వారి జోలికి పోకుండా, భాష్యం చెప్పిన వారిని మాత్రం దెప్పిపొడవడం.. భాజపా నేతలకే చెల్లుతున్నదంటూ పలువురు జోకులేసుకుంటున్నారు.