Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : హస్తినలో ప్రజలందరికీ వైరస్ పరీక్షలు

By:  Tupaki Desk   |   15 Jun 2020 12:30 PM GMT
బ్రేకింగ్ : హస్తినలో ప్రజలందరికీ వైరస్ పరీక్షలు
X
ఢిల్లీ లో గత కొన్ని రోజులుగా వైరస్ మహమ్మారి పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రజలందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఎల్జీ అనిల్ బైజల్ హామీ ఇచ్చారు. ఈ వైరస్ పై సోమవారం అమిత్‌షా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆమ్‌ ఆద్మీ, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఢిల్లీతో పాటు రాజధాని ప్రాంతం(ఢిల్లీతో సరిహద్దు కలిగిన ఉత్తర ప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు)లో కూడా ప్రతీ ఒక్కరికీ టెస్టులు చేసేందుకు సిద్ధంగానే ఉన్నట్లు తెలిపారు.

ఆయా పార్టీలు తమ తమ సిద్ధాంతాలను పక్కన పెట్టి మరీ, వైరస్ టెస్టుల సంఖ్య పెంచాల్సిందేనని ఈ సమావేశంలో డిమాండ్ చేశాయి. ఇప్పటి వరకూ కేంద్రం, రాష్ట్రం చేస్తున్న చర్యలను అమిత్‌షా అఖిలపక్షం ముందు పెట్టారు. వైరస్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించడంలో అన్ని పార్టీలూ ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ వైరస్ పరీక్షలు నిర్వహించాల్సిందేనని కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేసింది. అంతేకాకుండా.. కరోనా బారిన పడ్డ కుటుంబాలకు, కంటేయిన్ ‌మెంట్ జోన్లలో ఉన్న కుటుంబాలకు పది వేల చొప్పున సహాయం అందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది.

ఇందుకు సానుకూలంగా స్పందించిన అమిత్‌ షా.. కరోనా విజృంభణ నేపథ్యంలో రోజుకు 18 వేల మందికి చొప్పున కరోనా పరీక్షలు చేయించనున్నట్లు వెల్లడించారు. జూన్ 20 నాటికి ఢిల్లీ ప్రభుత్వం రోజుకు 18,000 వైరస్ పరీక్షలు చేయడం ప్రారంభిస్తుందని అమిత్‌షా తెలిపారు. సోమవారం నాటికి అక్కడ 41, 182 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 1327 మంది మృతి చెందారు.