Begin typing your search above and press return to search.

అమ్మ అమిత్ షా.. ఆశ ఎక్కువే..!

By:  Tupaki Desk   |   27 May 2016 11:18 AM GMT
అమ్మ అమిత్ షా.. ఆశ ఎక్కువే..!
X
నేను పావ‌లా ఇస్తా.. నువ్వు మాత్రం రూపాయి ఇవ్వాల‌న్న‌ట్లుంది బీజేపీ అధినేత అమిత్ షా య‌వ్వారం. ఏపీకి త‌మ‌కు ప్ర‌త్యేక రాష్ట్రమ‌ని క‌బుర్లు చెప్పే క‌మ‌ల‌నాథులు.. చేత‌ల్లో ఏం చేస్తున్నారో తెలిసిందే. పెద్ద పెద్ద హామీల అమ‌లు త‌ర్వాత‌.. నాలుగు రూపాయిల్ని ధారాళంగా రాల్చే విష‌యంలో నాన్చి.. నాన్చి.. స‌హ‌నానికి ప‌రీక్ష‌లు పెట్ట‌టం మోడీ ప‌రివారానికి అల‌వాటేన‌న్న విష‌యం గ‌డిచిన రెండేళ్లుగా తీసుకుంటున్న నిర్ణ‌యాల్ని చూస్తే అర్థ‌మ‌వుతుంది.

ఎన్డీయే కూట‌మిలో భాగ‌స్వామి అయిన చంద్ర‌బాబు రాజ‌కీయ అవ‌స‌రాల మీద సానుకూలంగా స్పందించే విష‌యంలో పినాసిత‌నంతో వ్య‌వ‌హ‌రించే బీజేపీ నేత‌లు.. త‌మ‌కు అవ‌స‌ర‌మైన వాటిని ఆన్ డిమాండ్ మీద తీసుకెళ్ల‌టం క‌నిపిస్తుంది. తాజాగా జ‌రుగుతున్న రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఏపీ నుంచి ఒక సీటును బీజేపీ కోరుతుంద‌న్న వాద‌న‌ను నిజం చేస్తూ తాజాగా అమిత్ షా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

రాజ్య‌స‌భ స్థానాన్ని బీజేపీ ఇచ్చే ప్ర‌తిపాద‌న ఏమీ లేద‌ని నిన్న‌టివ‌ర‌కూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ ఇద్ద‌రూ స్ప‌ష్టం చేసిన త‌ర్వాత‌.. అమిత్ షా నోటి నుంచి చంద్ర‌బాబును రాజ్య‌స‌భ సీటును అడ‌గ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించ‌టం గ‌మ‌నార్హం.

గ‌తంలో బీజేపీ.. టీడీపీ మ‌ధ్య కుదిరిన ఒప్పందం ప్ర‌కారం రెండు గ‌వ‌ర్న‌ర్ పోస్టులు ఇవ్వాల్సి ఉంద‌ని చెబుతారు. ఏళ్లు గ‌డుస్తున్నా..ఆ హామీని నెర‌వేర్చింది లేదు. అయితే.. అందుకు భిన్నంగా రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని త‌మ‌కు కేటాయించాలని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును కోరుతామంటూ అమిత్ షా వెల్ల‌డించ‌టం చూసిన‌ప్పుడు.. ఇచ్చేది త‌క్కువైనా.. తీసుకునేది మాత్రం ఎక్కువేన‌న్నట్లు అమిత్ షా వైఖ‌రి ఉన్న‌ట్లుగా చెప్పొచ్చు.