Begin typing your search above and press return to search.

కేసీఆర్ ట్రాప్‌లో ప‌డొద్దు.. సొంత పార్టీ నేత‌ల‌కు అమిత్ షా వార్నింగ్‌...!

By:  Tupaki Desk   |   21 Dec 2021 11:30 PM GMT
కేసీఆర్ ట్రాప్‌లో ప‌డొద్దు.. సొంత పార్టీ నేత‌ల‌కు అమిత్ షా వార్నింగ్‌...!
X
తెలంగాణలో గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయం తర్వాత తెలంగాణలో బిజెపి పలు అంశాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని దూకుడు పెంచింది. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు విషయంలో రెండు ప్రభుత్వాల మధ్య పెద్ద రాజకీయ యుద్ధమే కొనసాగుతోంది. ధాన్యం కొనుగోలు విషయంలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ పొలిటిక‌ల్ కాక పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు తెలంగాణలో బీజేపీ కీలక నేతలు... ఆ పార్టీ ఎంపీలు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు.

ఈ సందర్భంగా అమిత్ షా తెలంగాణ బిజెపి నేతలకు పలు సూచనలు చేయడంతో పాటు... రాష్ట్రంలో పార్టీని ఎలా ? ముందుకు తీసుకు వెళ్ళాలా ? అన్న విషయంపై నిర్దేశం కూడా చేసినట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు.. ఇప్పటి నుంచే రాజకీయ సమరానికి సిద్ధం కావాలని కూడా సూచించారని సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక విషయాల్లో విఫలమైందని.. వీటిని ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్లాలని కూడా ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే తాను త్వరలోనే తెలంగాణ పర్యటనకు వస్తానని చెప్పిన అమిత్ షా... డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు.

కేసీఆర్ తిమ్మిని బమ్మిని చేస్తారని... రాష్ట్ర బీజేపీ నేతలు అందరూ కూడా ఆయన ట్రాప్‌లో పడకుండా ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటం చేయాలని ... అవినీతి అంశాలను ప్రజలకు వివరించాలని కూడా ఆయన సూచించారు. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలా అయితే సమష్టిగా పోరాటం చేసి విజయం సాధించామో... అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా విజయం సాధించాలన్నారు.

ఇక కేసీఆర్‌కు వ్యతిరేకంగా మీరు చేయాల్సింది మీరు చేయండి... కేంద్ర ప్రభుత్వ పరంగా ఏం చేయాలో తమకు వదిలేయాలని కూడా అమిత్ షా రాష్ట్ర పార్టీ నేతలకు సూచించినట్టు తెలిసింది. వచ్చే సాధారణ ఎన్నికలు మరో రెండున్నర సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో... ఇకపై తాను త‌ర‌చూ తెలంగాణలో పర్యటిస్తానని కూడా వారికి హామీ ఇచ్చారట‌.

ఈ స‌మావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, మాజీ మంత్రులు, ఈటల రాజేందర్‌, డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అర్వింద్‌, మాజీ ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, జితేందర్‌రెడ్డి , విజయశాంతి ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్ హాజ‌ర‌య్యారు.