Begin typing your search above and press return to search.

చీర లాగి కొట్టినోళ్లు.. అమ్మను పొగిడేశారు

By:  Tupaki Desk   |   7 Dec 2016 4:40 PM GMT
చీర లాగి కొట్టినోళ్లు.. అమ్మను పొగిడేశారు
X
తమిళ రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికార అన్నాడీఎంకేకు.. విపక్ష డీఎంకేకు మధ్య వైరం అందరికి తెలిసిందే. పచ్చగడ్డి వేస్తే భగ్గున మండేలా ఉంటుంది వీరి మధ్య వ్యవహారం. అమ్మను విపరీతంగా ద్వేషించే డీఎంకే నేతలు సైతం.. ఇప్పుడు ‘అమ్మా’ అంటూ కీర్తించేస్తున్నారు. నిండు సభలో అమ్మ చీరను లాగి.. ఆమె మీద దాడి చేసిన పార్టీగా మచ్చ వేసుకున్న డీఎంకేకు చెందిన నేతలు.. ఇప్పుడు పాత విషయాల్ని మర్చిపోయారు. అమ్మను సరికొత్తగా పొగిడేశారు.

అమ్మ పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన మెరీనా బీచ్ దగ్గర పెట్టిన ఫ్లెక్సీ ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. అమ్మ నిలువెత్తు ఫోటో వేసి.. అమ్మను ఆకాశానికి ఎత్తేస్తూ తమిళంలో రాసిన వ్యాక్యాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘‘మమ్మల్ని ధైర్యంగా ఎదుర్కోవటానికి మీరు లేరు. వేలాది మంది రాజకీయ నాయకులు మాతో ఢీ కొట్టటానికి సిద్ధంగా ఉన్నా.. వారిలో ఒక్కరు కూడా మీలాంటి యోధురాలికి సాటి రాగలరా? రాజకీయ ఎన్నికల సంగ్రామంలో ధీర వనితగా మీరు నిలిచినప్పుడు.. మా కమాండ్ ఇన్ చీఫ్ (కరుణ).. జనరల్ (కరుణ కుమారుడు స్టాలిన్) ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే.. మంచి మనసుతో అందరి హృదయాల్ని మీరు గెలుచుకున్నారు’’ అంటూ పొగిడేసిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

డీఎంకే నేతలు పొగిడినంత కాకున్నా.. అమ్మ మరణం తమిళనాడుకు తీరని లోటుగా డీఎంకే అధినేత కరుణ.. ఆయన రాజకీయ వారసుడు స్టాలిన్ వ్యాఖ్యానించటం గమనార్హం.