Begin typing your search above and press return to search.

రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన అమ్మ మేనకోడలు

By:  Tupaki Desk   |   25 March 2021 4:39 AM GMT
రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన అమ్మ మేనకోడలు
X
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెర వెనుక ఏం జరుగుతుందన్న విషయాలు బయటకు రాకున్నా.. తెర మీద మాత్రం ఎప్పటికప్పుడు సంచలన ప్రకటనలకు కొదవ ఉండటం లేదు. అమ్మ వారసత్వం కోసం పోటీ పడిన వారు ఒకరు తర్వాత ఒకరు చొప్పున కామ్ అయిపోవటం గమనార్హం.

ఈ మధ్యనే జైలు నుంచి బయటకు వచ్చి.. భారీ ర్యాలీతో తమిళనాడులోకి ఎంట్రీ ఇచ్చిన చిన్నమ్మ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అలాంటి ఆమె.. కొద్ది రోజులకే తన రాజకీయ కార్యకలాపాల్ని పక్కన పెట్టేయటమే కాదు.. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో తాను పోటీ చేయటం లేదని చెప్పారు. అంతేకాదు.. క్రియాశీల రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ.. కామ్ గా ఉంటున్నారు.

ఇదిలా ఉంటే.. గతంలో అమ్మకు అసలైన వారసురాలిని తానేనంటూ హడావుడి చేసిన జయలలిత మేనకోడలు దీప.. ఇప్పుడురాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఎంజీఆర్ అమ్మ దీప పేరవై వ్యవస్థాపక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న ఆమె.. అమ్మ మరణించిన తర్వాత ఆమె రాజకీయాలకు.. ఆస్తికి తానే అసలైన వారసురాలినని తెరపైకిరావటం తెలిసిందే.

ఆమెను అన్నాడీఎంకే ఆహ్వానించినా కాదని.. కొత్త కుంపటిని పెట్టుకున్నారు. అమ్మ మరణంతో ఖాళీ అయిన చెన్నైలోని ఆర్కే నగర్ నుంచి పోటీకి సిద్ధమై తర్వాత వెనక్కి తగ్గారు. అనంతరం.. తన పార్టీలోని కీలక బాధ్యతల్ని తన కారు డ్రైవర్ కు అప్పగించటం ద్వారా సంచలనంగా మరారు. ఈ నిర్ణయంపై దీప భర్త తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి మరో పార్టీని పెట్టుకున్నారు. దీప నుంచి విడిపోయి వేరుగా ఉంటున్నారు. అయితే.. ఆమె ఆశించినంత స్పందన ప్రజల్లో లేకపోవటంతో ఆమె కామ్ గా ఉంటున్నారు. తాజాగా ఆమె తాను రాజకీయాల నుంచి శాశ్వితంగా వైదొలుగుతున్నట్లుగా ప్రకటించారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఆమె పేర్కొనటం గమనార్హం.