Begin typing your search above and press return to search.

'అమ్మ' సినిమా హాళ్లు...టికెట్ 10 రూపాయలే..

By:  Tupaki Desk   |   17 July 2016 7:03 AM GMT
అమ్మ సినిమా హాళ్లు...టికెట్ 10 రూపాయలే..
X
పథకాల పురుచ్చి తలైవి.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రవేశపెట్టే పథకాలను ఎవరూ ఊహించలేరేమో. ఆమె తీసుకొచ్చే ఉచిత పథకాలు - రాయితీ పథకాలు అన్నీ ప్రజలను విపరీతంగా అట్రాక్టు చేసేలా ఉంటాయి. తాజాగా తమిళులను ఆమె మరో పథకంతో ఫ్లాట్ చేసేందుకు రెడీ అయ్యారు. అసలే సినిమాలంటే పడి చచ్చే తమిళులకు అతి తక్కువ ధరకే సినిమాలు చూసే అవకాశం కల్పిస్తున్నారామె. ఇప్పటికే ఫోన్లు - ల్యాప్ టాప్ లు - మిక్సీలు - ఫ్యాన్లు - గ్రైండర్లు వంటివన్నీ ఫ్రీగా ఇచ్చిన జయ ఇప్పుడు మరింత వినోదాన్ని వారికి చేరువ చేయబోతున్నారు.

మల్టీప్లెక్స్ - మాల్స్ సంఖ్య పెరిగిపోవడంతో తమిళనాడులో సినిమా టిక్కెట్ల ధరలు భారీగా ఉన్నాయి. చిత్రాలు చూడాలంటే రూ. 125 చెల్లించాల్సి వుండటంతో జయలలిత పేదల కోసం అమ్మ సినిమా హాల్స్ కాన్సెప్టును తెరపైకి తెచ్చారు. వాస్తవానికి చెన్నైలోని మల్టీప్లెక్సుల్లో తెరముందు ఒక వరుస సీట్లు రూ. 10కే విక్రయిస్తున్నప్పటికీ, సీట్ల సంఖ్య చాలా తక్కువ కావడంతో పేదలు వినోదాన్ని పొందలేకపోతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఆమె మూడు కేటగిరీల్లో చవక ధరలకు టిక్కెట్లతో థియేటర్లే అందుబాటులోకి తెస్తోంది.

అమ్మ సూచనల మేరకు చెన్నై కార్పొరేషన్ కనుసన్నల్లో నడిచేలా రెండు థియేటర్లు ప్రారంభమయ్యాయి. టీ నగర్ - పెనాయ్ నగర్ లో భారీ థియేటర్లను సర్కారు సిద్ధం చేసింది. దాదాపు 3 వేల మంది ఒకేసారి సినిమా చూసేలా పెనాయ్ నగర్ - కలై అరంగం హాల్ ను రూ. 17 కోట్లకు పైగా వెచ్చించి మార్పులు చేర్పులు చేశారు. ఇక్కడ టికెట్ ధర రూ. 10 నుంచి రూ. 30 మధ్య మూడు క్లాసులుగా ఉంటుంది. డీటీఎస్ వంటి సదుపాయాలూ ఉంటాయి. వీటితో పాటు ముగప్పేర్ - చేట్ పట్ ప్రాంతాల్లోనూ అమ్మ హాల్స్ నిర్మించే యోచనలో సర్కారు ఉంది.

కాగా ఇప్పటికే రికార్డు స్థాయిలో వరుసుగా రెండోసారి అధికారం అందుకున్న జయ ఇలాంటి ప్రజాకర్షక పథకాలకు తెరతీస్తే ఇక తమ పని ఆఖరే అని అక్కడి విపక్షాలు టెన్షన్ పడుతున్నాయి. పరిశీలకులు మాత్రం అమ్మ విపక్షాలకు సినిమా చూపిస్తోందని అంటున్నారు.