Begin typing your search above and press return to search.

బీరుట్ పేలుళ్లు: 2700 టన్నుల ఆ రసాయనంతోనే అంత ఎఫెక్ట్

By:  Tupaki Desk   |   5 Aug 2020 5:32 PM GMT
బీరుట్ పేలుళ్లు: 2700 టన్నుల ఆ రసాయనంతోనే అంత ఎఫెక్ట్
X
‘‘మొదట బాణసంచా పేలుళ్లు అనుకున్నాం. అంతలోనే.. భూమి ప్రకంపనలకు గురయ్యేలా పెద్ద పెద్ద శబ్దాలు. చూస్తున్నంతనే కిలోమీటర్లకొద్దీ భవనాలు నేలమట్టమయ్యాయి. ఆకాశం మొత్తం పొగలతో.. దుమ్ముతో నిండిపోయింది’’ లెబనాన్ రాజధాని బీరుట్ పేలుళ్లపై ప్రత్యక్ష సాక్షి చెప్పిన మాట. అయితే. ఇదేమీ పేలుళ్లు కావని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఈ పేలుళ్ల వెనుక ఉన్నదేమిటన్న సస్పెన్స్ కు తెర దంచారు. ఆ దేశ ప్రధాని.

ఒక గోదాములో దాచి ఉంచిన భారీ రసాయనాలే ఈ భారీ పేలుళ్లకు కారణంగా తేల్చారు. ఇంతకీ ఈ రసాయనం ఏమిటన్న ఆరా కు ఆ దేశం చెబుతున్న సమాధానం ‘ఆమ్మోనియం నైట్రేట్’. దాదాపు 2700 టన్నుల (ఒక్కో టన్ను వెయ్యి కేజీలతో సమానం. అంటే 2.7లక్షల కేజీలు) రసాయనమే ఇంత భారీ విధ్వంసానికి కారణంగా చెబుతున్నారు.

ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ఈ స్థాయిలో రసాయనాల్ని నిల్వ ఉంచటం బాధ్యతారాహిత్యంగా ఆ దేశ ప్రధాని హసాన్ దియాబ్ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఉదంతానికి కారణమైన వారి విషయంలో తాము మౌనంగా ఉండమని.. వారు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం ఈ పేలుళ్ల కారణంగా వంద మంది మరణించగా.. నాలుగువేల మందికి పైనే గాయాలపాలైనట్లు చెబుతున్నారు. ఇక.. కూలిపోయిన భవంతులు వందల్లో ఉండగా.. దెబ్బ తిన్న నిర్మాణాలు వేలాదిగా ఉన్నాయి. శిధిలాల్లో చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఇంత విధ్వంసానికి కారణమైన ఆమోనియం నైట్రేట్ రసాయనం ఇంత ప్రభావాన్ని చూపుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇంతకీ ఈ రసాయనాన్ని ఎందుకు వాడతారు? అన్నది చూస్తే.. ఎక్కువగా వ్యవసాయ ఎరువుగా వినియోగిస్తుంటారు. అదేసమయంలో పేలుళ్ల కోసం కూడా వాడతారు. ఆమోనియం నైట్రేట్ ఎంత ప్రమాదకరమైన రసాయనం అంటే.. దీనికి దగ్గరగా చిన్నపాటి అగ్గి రవ్వలు ఉన్నా.. ఇది మహాశక్తివంతంగా పేలే గుణం దీని సొంతం.

ఈ రసాయనం విడుదలైన వేళలో ప్రాణాంతకమైన వాయువులు విడుదల అవుతాయి. ఆమోనియం నైట్రేట్ నుంచి విషపూరితమైన నైట్రోజన్ ఆక్సైడ్ తోపాటు.. ఆమోనియా వాయువు విడుదల అవుతుంది. అందుకే ఈ ప్రమాదకరమైన రసాయనాన్ని నిల్వ ఉంచే చోట.. ఎలాంటి డ్రైనేజీ.. పైపులు.. ఇతర ప్రవాహక వాహకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. తాజాగా బీరుట్ లో జరిగిన పేలుడు తీవ్రత ఎంతంటే.. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న షాపింగ్ మాల్ లోని గాజుఅద్దాలు సైతం ధ్వంసమయ్యాయి అంటే పేలుడు తీవ్రత ఎంత ఎక్కువన్నది ఇట్టే అర్థం కాక మానదు.