Begin typing your search above and press return to search.

సెలెబ్రిటీలు అంత ‘సీరియస్’గా ఉన్నారట

By:  Tupaki Desk   |   5 Sep 2016 5:39 AM GMT
సెలెబ్రిటీలు అంత ‘సీరియస్’గా ఉన్నారట
X
సెలబ్రిటీల్లో భాగమైన సినీ తారలకు ఉండే అవకాశాలు వేరేవరికీ రావేమో. ప్రజల్లో క్రేజ్ మాత్రమే కాదు రాజకీయ పార్టీలకూ వారి పట్ల విపరీతమైన క్రేజ్ ఉంటుంది. దీంతో.. వారే మాత్రం సీరియస్ గా ఉన్నా పదవులు వరిస్తాయి. అలా చేతికి వచ్చిన పదవుల్ని వారెంత శ్రద్ధ చూపిస్తున్నరన్నది ఆసక్తికరమైన అంశమే. గతంలో సెలెబ్రిటీలు పొలిటీషియన్స్ గా అవతారం ఎత్తితే.. అందులో వారి రాణింపు అంతంతమాత్రమే. పదవుల్లోకి వచ్చేందుకు ప్రదర్శించే శ్రద్ద.. పదవులు చేతికి చిక్కిన తర్వాత మాత్రం వాటిని నిలుపుకునే విషయంలో వారు అంతగా శ్రమించిన దాఖలాలు కనిపించవు. తెలుగు రాజకీయాల్లో సినిమా రంగం నుంచి వచ్చిన వారిలో ఎన్టీఆర్ తప్పించి మరెవకరూ అంత సీరియస్ గా తీసుకున్నట్లుగా కనిపించదు.

పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లో ఉన్నా వారి కమిట్ మెంట్ విషయంలో మాత్రం పలు సందేహాలు వ్యక్తమయ్యే పరిస్థితి. ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా వివిధ పార్టీల్లో ఉన్న సినీతారలు కమ్ పొలిటీషియన్స్ తీరుపై ఒక సంస్థ తాజాగా ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వే నివేదికను చూసిన వారంతా సంతోషానికి గురికావాల్సిందే. సినిమాల్లో ప్రదర్శించే తీరుకు తగ్గట్లే రాజకీయాల్ని సైతం సీరియస్ వ్యాపంగా వారు తీసుకున్నట్లు కనిపిస్తోంది.

చట్టసభలకు ఎన్నికైన సినీ ప్రముఖులకు తమ పనుల విషయంలో ప్రదర్శించినంత శ్రద్ధ.. ప్రజాప్రతినిధులుగా సభకు హాజరయ్యే విషయంలో వారు చక్కటి మార్కులు సాధించటం విశేషంగా చెప్పాలి. సార్వత్రిక ఎన్నికల్లోనూ.. రాజ్యసభకు ఎంపికైన పలువురు సినీ ప్రముఖులు లోక్ సభ.. రాజ్యసభల్లో నిర్వహించే సమావేశాలకు హాజరు కావటమే కాదు.. పలు ప్రశ్నలు సంధించినట్లుగా తాజా సర్వే స్పష్టం చేస్తోంది.

ప్రముఖ సినీ నటుడు అనుపమ్ ఖేర్ సతీమణి కిరణ్ ఖేర్.. చండీగఢ్ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ పార్లమెంటు సమావేశాల్లో ఆమె హాజరు 85 శాతం నమోదు కావటం గమనార్హం. ఆమె ఒక్కతే కాదు అహ్మాదాబాద్ తూర్పు నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ పరేశ్ రావల్ (సినిమాల్లో విలన్ వేషాలు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్) హాజరు 76 శాతం ఉంది. వీరిద్దరే కాదు.. వీరి బాటలోనే నడుస్తున్నరు తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన శతాబ్దిరాయ్.. మనోజ్ తివారీ.. మూన్ మూన్ సేన్.. తాపస్ పాల్ ల హాజరు కూడా బాగుండటం గమనార్హం.

సినీ రంగం నుంచి పాలిటిక్స్ లోకి ఎన్నికైన లోక్ సభ.. రాజ్యసభ ఎంపీలు సభకు ఏ మేరకు హాజరు అవుతున్నారన్న అంశంపై ఒక సంస్థ సర్వే నిర్వహించగా ఈ ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. గతంతో పోలిస్తే.. పొలిటీయన్స్ గా మారిన సినీ స్టార్స్ సీరియస్ గా సభకు రావటమే కాదు.. పలు ప్రశ్నల్ని సంధిస్తున్న వైనం కనిపిస్తుంది. సీరియస్ గా వ్యవహరిస్తున్న వారికి తగ్గట్లే.. లైట్ తీసుకుంటున్న సినీ ప్రముఖులు కూడా కనిపిస్తారు. అలాంటి వారిలో 2012లో రాజ్యసభకు ఎన్నికైన నాటి తరపు బ్యూటీ రేఖ కేవలం 5 శాతం మాత్రమే సభకు హాజరు కావటం గమనార్హం. వీరితో పాటు మధుర నియోజకవర్గం నుంచి ఎన్నికైన హేమమాలిని కేవలం 37 శాతం మాత్రమే హాజరయ్యారు. వీరే కాక వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికైన పలువురు సినీ నటుల (వినోద్ ఖన్నా.. ఒడియా నటుడు సిద్దాంత్ మహాపాత్ర.. అనుభవ్ మహంతి) సభా హాజరు వేలెత్తి చూపేలా లేకపోవటం గమనార్హం. ఏమైనా సినీ సెలబ్రిటీలు రాజకీయంగా తమ బాధ్యతల పట్ల సీరియస్ గా ఉండరన్న భావాన్ని తుడిపేసేలా వ్యవహరించటం శుభ సూచకంగా చెప్పక తప్పదు.