Begin typing your search above and press return to search.

అమరావతి రైతుల మహాపాదయాత్ర షురూ..

By:  Tupaki Desk   |   1 Nov 2021 6:42 AM GMT
అమరావతి రైతుల మహాపాదయాత్ర షురూ..
X
అమరావతిలో రైతుల మహాపాదయాత్ర మొదలైంది. తూళ్లూరు నుంచి రైతులు కదం తొక్కారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ మహా పాదయాత్రగా దీనికి నామకరణం చేశారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు వేంకటేశ్వరస్వామి, న్యాయదేవత ప్రతిమలకు పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సర్వమత ప్రార్థనలు చేశారు. ఏకైక రాజధానిగా అమరావతి పరిరక్షణ కోసం ఈ యాత్రను చేపట్టారు. పాదయాత్రలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, వివిధ రాజకీయ పక్షాల నేతలు పాల్గొన్నారు.

ఈ మహా పాదయాత్ర మొత్తం 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబర్ 17న తిరుపతిలో ముగియనుంది. అమరావతి రైతులు యాత్రకు విపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. ముందు మహా పాదయాత్రకు డీజీపీ గౌతమ్ సవాంగ్ అనుమతి నిరాకరించారు. రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో పాదయాత్రకు అనుమతి లభించింది.

అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి రంగంలోకి దిగారు. ఖమ్మం నుంచి ఆంధ్రాలోకి ఎంటర్ అయిన ఆమెకు ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు.

కోర్టు ఆదేశాలతో డీజీపీ గౌతం సవాంగ్ ఈ రైతుల మహాపాదయాత్రకు అనుమతినిచ్చారు. పలు ఆంక్షలను విధించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలోనే పాదయాత్ర చేపట్టాలన్నారు. హైకోర్టుకు సమర్పించిన జాబితాలోని 157 మంది మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని స్పష్టం చేశారు. ఎక్కడా బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించకూడదని డీజీపీ సూచించారు. రూట్ మ్యాప్ ను అనుమతి లేకుండా మార్చకూడదని స్పష్టం చేశారు. హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని శాంతియుతంగా పాదయాత్ర చేపట్టాలన్నారు.