Begin typing your search above and press return to search.

అమరావతి రైతుల కొత్త ఆశ.. కేటీఆర్.. మరి రియాక్టు అవుతారా?

By:  Tupaki Desk   |   12 March 2021 9:30 AM GMT
అమరావతి రైతుల కొత్త ఆశ.. కేటీఆర్.. మరి రియాక్టు అవుతారా?
X
ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కుపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించిన వైనంపై ఏపీ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం కాగా.. విశాఖలో అయితే కేటీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేయటం తెలిసిందే. విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ఇస్తామని.. అవసరమైతే తాము కూడా విశాఖకు వస్తామన్న ఆయన మాట సంచలనంగా మారటమే కాదు.. పెద్ద ఎత్తున సానుకూల స్పందన లభిస్తోంది. ఇలాంటివేళ.. కేటీఆర్ కు మరో రిక్వెస్టు వచ్చింది.

గడిచిన450 రోజులుగా నిరసన చేస్తున్న అమరావతి రైతులు.. రాజధాని విషయంలోనూ కేటీఆర్ తమకు మద్దతు ప్రకటించాలని వారుకోరుతున్నారు. విశాఖ ఉక్కు విషయంలో ప్రదర్శించిన చొరవను.. కేటీఆర్ అమరావతి విషయంలోనూ ప్రదర్శించాలని కోరుతున్నారు. అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరయ్యారని.. ఆ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రపంచప్రఖ్యాత నగరంగా విరాజిల్లాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసిన వైనాన్ని గుర్తు చేశారు.

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా గళం విప్పిన అమరావతి రైతులు గడిచిన 450 రోజులుగా నిరసనలు.. ఆందోళనలు చేస్తున్నారు. అయినప్పటికి వారి డిమాండ్లపై ఏపీ సర్కారు ఇప్పటివరకు పట్టించుకున్నది లేదు. ఇలాంటివేళ.. విశాఖ ఉక్కు ఉదంతం తెర మీదకు రావటం.. దానికి కేటీఆర్ మద్దతు తెలపటంతో.. అమరావతి రైతుల్లో కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. మరి.. వారి రిక్వెస్టు విషయంలో కేటీఆర్ స్పందిస్తారా? కామ్ గా ఉంటారా? అన్నది ప్రశ్న.