Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ సర్వేలో అమరావతికే ఓటు.. చేసింది ఎవరో తెలిస్తే సందేహాలే

By:  Tupaki Desk   |   30 Aug 2020 8:30 AM GMT
ఆన్ లైన్ సర్వేలో అమరావతికే ఓటు.. చేసింది ఎవరో తెలిస్తే సందేహాలే
X
విభజనతో నిండా మునిగిన ఏపీకి కష్టాలు తీరటం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మాదిరి హైదరాబాద్ లాంటి మహానగరం లేకపోవటం.. దానికి వచ్చే ఆదాయం ఏపీకి లేకపోవటం పెద్ద మైనస్సుగా చెప్పాలి. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కొత్త సమస్యల్ని తెర మీదకు తెస్తున్నాయి. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు.. ఈ అంశంపై పెద్ద ఎత్తున సాగుతున్న ఆందోళనల గురించి తెలిసిందే.

ఏపీ రాజధానిగా అమరావతిని కంటిన్యూ చేయాలా? మూడు రాజధానుల పై ప్రజలు ఏమనుకుంటున్నారు? రాజధానిగా ఏపీ ప్రజల ఓటు దేనికి లాంటి అంశాల పై ఆన్ లైన్ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేకు విశేష ఆదరణ లభిస్తోంది. సర్వేను ప్రారంభించిన ఆరు రోజులకే 3.76 లక్షల మంది తమ అభిప్రాయాన్ని తెలిపారు. సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు (95శాతం) అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని కోరటం గమనార్హం.

ఏపీ విత్ అమరావతి.కామ్ పేరుతో టీడీపీ ఒక వెబ్ సైట్ ను రూపొందించింది. దీని ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకకు వీలుగా ఏర్పాటు చేశారు. సర్వేలో పాల్గొన్న వారంతా ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరారని టీడీపీవర్గాలు పేర్కొంటున్నాయి.

ఇలాంటి సర్వేలతో వచ్చే ఇబ్బందేమంటే.. వాటిని నిర్వహించే వారికి తగ్గట్లు ఫలితాలు రావటం. దాని కంటే కూడా.. ఏపీలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఓటింగ్ నిర్వహిస్తే మరింత బాగుంటుంది కదా? అదేం కాదనుకుంటే.. స్వతంత్ర సంస్థ ద్వారా సర్వే నిర్వహిస్తే మంచిది. అంతేకానీ టీడీపీ నిర్వహించిన సర్వేను ప్రజల మూడ్ గా చెప్పటం సరికాదేమో?