Begin typing your search above and press return to search.

'అమృత్ స‌ర్' ఘోర‌క‌లి...మాన‌వ త‌ప్పిద‌మా?

By:  Tupaki Desk   |   20 Oct 2018 10:50 AM GMT
అమృత్ స‌ర్ ఘోర‌క‌లి...మాన‌వ త‌ప్పిద‌మా?
X
పంజాబ్‌ లోని అమృత్‌ సర్ లో జ‌రిగిన ఘోర రైలు ప్ర‌మాదం దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. రావ‌ణ ద‌హ‌నం కార్య‌క్ర‌మం జ‌రిగిన ప్రాంతాన్ని ఆ రైలు రావ‌ణ కాష్టంలా మార్చివేసింది. చిమ్మ చీక‌టిని చీల్చుకుంటూ వ‌చ్చి చ‌డీ చ‌ప్పుడూ లేకుండా 60 మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. స‌మాచారం చేర‌వేసేందుకు ఆధునిక టెక్నాల‌జీ...అత్యాధునిక సిగ్న‌ల్ వ్య‌వ‌స్థ...ఆధునీకరించిన రైళ్లు....ఇవ‌న్నీ ఉండి కూడా ఇంత‌టి పెను ప్ర‌మాదం జ‌ర‌గ‌డం మాన‌వ‌త‌ప్పిదం త‌ప్ప మ‌రోటి కాదు. ఆ ఘోర రైలు ప్ర‌మాదం జ‌రిగినపుడు కొంద‌రు తీసిన వీడియోను బ‌ట్టి ఆ ప్ర‌మాదానికి రైలు లోకో పైల‌ట్ దే పూర్తి బాధ్యత అని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న ఆ ఘ‌ట‌న తాలూకు లైవ్ వీడియోను బ‌ట్టి దాదాపుగా నెటిజ‌న్లు కూడా లోకోపైల‌ట్ - రైల్వే అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్లే ఇంత‌మంది నిండు ప్రాణాలు బ‌ల‌య్యాయ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇందుకు గ‌ల కార‌ణాల‌పై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

రైల్వే ట్రాక్ కు 100 మీట‌ర్ల‌ స‌మీపంలో రావ‌ణ ద‌హ‌నం కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసిన నేప‌థ్యంలో అక్క‌డి నిర్వాహ‌కులు...ట్రాక్ పై ప్ర‌జ‌లు నిల‌బ‌డ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుని ఉండాల్సింది. కానీ, ఈ వేడుకలకు నవజోత్‌ సింగ్‌ సిద్దు భార్య - స్థానిక ఎమ్మెల్యే - నవ్‌ జోత్‌ కౌర్‌ సిద్దు హాజరవ‌డంతో ఆమె రక్షణలో పోలీసులు నిమగ్నమ‌య్యారు. దీంతో, ప్రజలను పట్టించుకోలేదని ఓ వాద‌న వినిపిస్తోంది. ఇక బాణాసంచా పేలుడు భారీగా వినిపిస్తోన్న స‌మ‌యంలో....రైలు వేగంగా దూసుకువ‌చ్చింది. ఆ పేలుళ్ల సౌండ్ కు రైలు శ‌బ్దం విన‌ప‌డ‌లేదు - త‌మ‌ మీద‌కు రైలు వచ్చే వ‌ర‌కు ప్ర‌జ‌లు గ‌మ‌నించ‌లేదు. కానీ, ఆ సమయంలో రైలు కూత వేయలేదని స్థానికులు - ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఆ వీడియో నిశితంగా ప‌రిశీలిస్తే రైలు కూత వేయ‌లేద‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇది పూర్తిగా లోకోపైల‌ట్ నిర్లక్ష్యం.

అస‌లు రైలుకు ఉన్న లైట్ల వెలుగు...దాదాపు కిలోమీట‌ర్ ప‌రిధివ‌ర‌కు క‌నిపిస్తుంది. వంద‌లాది మంది జనం ట్రాక్ మీద ఉన్న సంగ‌తి లోకో పైల‌ట్ ఎలా చూడ‌లేద‌న్న సందేహం క‌లుగ‌క మాన‌దు. ఒక వేళ ఆటో పైల‌ట్ మోడ్ లో పెట్టి లోకో పైల‌ట్ నిద్రిస్తున్నాడా అన్న అనుమానాలు వ‌స్తున్నాయి. అందులోనూ - జోడాఫటాక్‌ వద్ద ప్రతి సంవత్సరం దసరా వేడుకలు జరుగుతాయని - ఆ సమయంలో రైళ్లను నెమ్మదిగా నడపాలని స్థానికులు చాలాకాలంగా రైల్వే శాఖను కోరుతున్నా పట్టించుకోవట్లేదనే ఆరోపణలున్నాయి. అటువంటిది...జోడా ఫాట‌క్ వ‌ద్ద రైలును ఆచితూచి న‌డ‌పాల‌ని లోకోపైల‌ట్ కు తెలీదా? ఆ కార్యక్రమానికి త‌మ‌ అనుమతి కోరలేదని రైల్వే శాఖ చేతులు దులుపుకొని స్థానిక అధికార యంత్రాంగంపైకి త‌ప్పును నెట్టేసింది.

వాస్త‌వానికి ఆ ప్రాంత వాసులంద‌రికీ డీఎంయూ 74943 రైలు స‌మ‌యాల గురించి ...వేగం గురించి తెలుసు. కానీ, దసరా వేడుకల రోజు మాత్రం నగరంలో రైళ్లు వేగంగా వెళ్ల‌వు. రైలు పట్టాల వెంబడి పలుచోట్ల దసరా వేడుకలు - రావ‌ణ ద‌హ‌నాలు జ‌ర‌గ‌డం అక్క‌డ ప‌రిపాటి. ఆ రోజు రైల్వే గేట్ల‌ను తెర‌చి ఉంచి.....జనాలకు ప్రమాదం జరగకుండా చూస్తారు. రైళ్లు కూడా మెల్లగా వెళుతూ హారన్‌ కొట్టుకుంటూ వెళతాయి.కానీ, నిన్న‌టి ప్ర‌మాదంలో హార‌న్ కొట్ట‌క‌పోగా....32 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్లాల్సిన రైలు....70 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకువెళ్లింది. ఇది రైల్వే శాఖ త‌ప్పిదం.

ఇక‌, డీఎంయూ రావడానికి 10 నిమిషాల ముందే మరో ట్రాక్‌ మీదు గా హౌరా ఎక్స్‌ ప్రెస్ హార‌న్ మోగిస్తూ వెళ్లింది. దీంతో, ఆ ట్రాక్‌ మీద ఉన్న వాళ్లంతా డీఎంయూ రాబోతోన్న ట్రాక్‌ మీదకు వచ్చారు. దీనిని బ‌ట్టి డీఎంయూ హార‌న్ మోగించ‌లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. అప్ప‌టికే రావ‌ణ ద‌హ‌నం మొద‌ల‌వ‌డంతో ఆ బాణాసంచా - ఎల్ ఈడీ వెలుగుల మీద దృష్టి పెట్టి సెల్ఫీలు - వీడియోలు తీస్తున్నారు. తామున్న‌ ట్రాక్‌ పైకి శరవేగంగా డీఎంయూ దూసుకు వస్తోందని వారు ఊహించలేకపోయారు. త‌మ‌పైకి రైలు దూసుకువ‌చ్చిన త‌ర్వాతే దానిని వారు గ‌మ‌నించారు. కానీ, ప‌క్క‌కు వెళ్లే అవ‌కాశం లేక‌పోవ‌డంతో 15 సెకన్లలోనే ఘోరం జరిగి 60 మంది ప్రాణాలు కోల్పోయారు.