Begin typing your search above and press return to search.

ప్రైవేటు డైరీలకు అమూల్ షాక్ తప్పదా ?

By:  Tupaki Desk   |   3 Nov 2020 5:45 AM GMT
ప్రైవేటు డైరీలకు అమూల్ షాక్ తప్పదా ?
X
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఈ నెల 25 వ తేదీ నుండి అమూల్ పాలసేకరణకు రెడీ అయిపోయింది. మొదటగా చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో పాలసేకరణ ప్రక్రియను మొదలుపెట్టబోతోంది. పాలసేకరణ, విక్రయం, మార్కెటింగ్ తదితరాల కోసం ఏపి డెయిరీ డెవలప్మెంట్ తో అమూల్ ఒప్పందం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. దేశంలోనే అత్యధిక ఆధరణ పొందిన అమూల్ తో నేరుగా ప్రభుత్వమే అవగాహనా ఒప్పందం చేసుకన్నది కాబట్టి వ్యాపారపరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావనే అనుకుంటున్నారు.

పాలసేకరణ, విక్రయం, సరఫరా తదితరాల కోసం మొత్తంమీద 9900 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే డిసైడ్ అయ్యింది. పై అంశాలపై ఇప్పటికే అమూల్ ఉన్నతాధికారులు ఏపిలోని అన్నీ జిల్లాల్లో పర్యటించి సర్వేలు చేశారు. వ్యాపార విస్తరణకు అవసరమైన రోడ్డు మ్యాపును కూడా ఏపి అధికారులతో కలిసి సిద్దం చేశారు. దీన్ని ఇటు ప్రభుత్వం అటు అమూల్ ఉన్నతస్ధాయి వర్గాలు ఆమోదించాయి. ఈనెల 20వ తేదీ నుండి ప్రయోగాత్మకంగా పై జిల్లాల్లో పాల సేకరణ ప్రారంభమవుతోంది.

ప్రయోగదశలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి 25వ తేదీ నుండి రంగంలోకి దిగబోతోంది. ముందుగా అధికారికంగా 300 పాల సేకరణ కేంద్రాలను ప్రారంభం అవబోతున్నాయి. ప్రైవేటు డెయిరీల నుండి ఎదురయ్యే పోటీని తట్టుకోవటానికి వీలుగా ఏపి డెయిరీ ఏపి మహిళా పాల ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేస్తోంది. దాదాపు 9 వేల మహిళా పాల ఉత్పత్తిదారుల సంఘాలను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు సమాచారం.

అమూల్ కార్యకలాపాలు రాష్ట్రంలోని అన్నీ జిల్లాల్లో స్పీడందుకునేందుకు వీలుగా ప్రభుత్వం జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటిలు నియమించింది. పాల ఉత్పత్తిదారులను ఆకట్టుకోవటంలో భాగంగా ఉత్పత్తిదారులకు ప్రతి పదిరోజులకు ఓసారి పేమెంట్ చేయాలని డిసైడ్ అయ్యింది. ప్రభుత్వం-అమూల్ భాగస్వామ్యం గనుక సక్సెస్ అయితే రాష్ట్రంలోని సుమారు 20 ప్రైవేటు డైరీలపై దెబ్బ పడటం ఖాయమనే అనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు పెద్ద డైరీలకు ఇబ్బంది లేకపోయినా మెల్లిగా అయినా సరే దెబ్బపడటం ఖాయం.

ఎందుకంటే పాల ఉత్పత్తిదారుల సంఘాలను ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. పాల సేకరణ, మార్కెటింగ్, ప్లాంట్ల ఏర్పాటు లాంటి వాటిని ప్రభుత్వమే దగ్గరుండి చూసుకుంటోంది. పైగా అమూల్ లాంటి ప్రఖ్యాతిగాంచిన సంస్ధ తో టైఅప్ అంటే వ్యాపారాభివృద్ధి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. కాబట్టి మొదటి ఏడాదిలో ఏమైనా సమస్యలు ఎదురైనా తర్వత్తర్వాత మాత్రం ప్రైవేటు డైరీలకు చుక్కలు కనబడటం ఖాయమనే అనిపిస్తోంది. చూద్దం ఏం జరుగుతుందో.