Begin typing your search above and press return to search.

40వేల ఎత్తులో రెండుసార్లు ఆగిన గుండెను కాపాడిన భారతీయుడు..!

By:  Tupaki Desk   |   6 Jan 2023 2:30 PM GMT
40వేల ఎత్తులో రెండుసార్లు ఆగిన గుండెను కాపాడిన భారతీయుడు..!
X
40వేల ఎత్తులో ఓ వ్యక్తికి రెండు సార్లు కార్డియాక్ వస్తే అక్కడి పరిస్థితి ఎలా మారుతుంది? సమయానికి అందుబాటులో ఎటువంటి పరికరాలు లేకపోతే అతడిని కాపాడటం సాధ్యమేనా? అంటే ఏమి చెప్పలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఓ భారతీయ వైద్యుడు తోటి ప్రయాణికుల సహకారంతో బాధిత వ్యక్తి ప్రాణాలు కాపాడి అందరి ప్రశంసలను అందుకున్నాడు.

ఈ సంఘటన గత ఏడాది నవంబర్ నెలలో యూకే నుంచి భారత్ కు వచ్చిన విమానంలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని తాజాగా బర్నింగ్ హమ్ యూనివర్సిటీ ఆస్పత్రి తమ అధికారిక ట్విట్లర్లో వెల్లడించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..!

బర్మింగ్ హామ్ యూనివర్సిటీ ఆస్పత్రిలో హెపటాలజిస్ట్ గా పని చేస్తున్న డా.విశ్వరాజ్ వేమల తన తల్లిని యూకే నుంచి భారత్ కు విమానంలో తీసుకొస్తున్నారు. విమానం 40వేల ఎత్తుకు చేరుకున్న సమయంలో తోటి ప్రయాణికులలో ఒక వ్యక్తి సడెన్ గా కార్డియాక్ అరెస్టుకు గురయ్యాడు. ఎయిర్ సిబ్బంది వైద్యుడికి కోసం ప్రయత్నించగా ఆయన సిబ్బంది కలిసి అతడి వద్దకు వెళ్లారు.

అప్పటికే అతడి పల్స్ పూర్తిగా ఆగిపోగా శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే దాదాపు గంటసేపు ప్రయత్నించి అతడిని డాక్ట్ విశ్వరాజ్ సృహలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. క్యాబిన్ సిబ్బంది దగ్గర ఉన్న మెడికల్ కిట్ లో ఆక్సిజన్.. ఆటోమేటెడ్ ఎక్స్ టర్నల్ డీఫిబ్రిలేటర్ తప్ప మరో వైద్య పరికరం లేదు.

ఈ సమయంలోనే ప్రయాణికుల వద్ద ఎవైనా పరికరాలు ఉన్నాయా? అడగగా అదృష్టవశాత్తు వారి వద్ద హార్ట్ రేట్ మానిటర్.. బీపీ మెషిన్.. పల్స్ ఆక్సీమీటర్.. గ్లూకోజ్ మీటర్ లభించాయి. వీటి సహాయంతో అతడి ఆరోగ్య పరిస్థితి వైద్యుడు సమీక్షించారు. ఆ సమయంలో ఆ వ్యక్తి రెండోసారి కార్డియాక్ అరెస్టుకు గురయ్యాడు.

క్యాబిన్ సిబ్బంది.. ప్రయాణికుల సహాయంతో అతడిని మళ్లీ సృహలోకి తెచ్చేందుకు సుమారు ఐదు గంటల పాటు శ్రమించినట్లు డాక్టర్ విశ్వరాజ్ వివరించారు. ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా విమానాన్ని ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ చేయగా అప్పటికే అక్కడ వేచి ఉన్న ఎమర్జెన్సీ వైద్య సిబ్బందికి అతడిని అప్పగించినట్లు ఆయన తెలిపారు.

తన మెడికల్ ప్రాక్టీసులో ఇలాంటి కేసులు అనేకం చూశానని అయితే 40వేల ఎత్తులో నాతోపాటు ప్రయాణికులంతా ఒక ప్రాణాన్ని కాపాడటంతో అందరూ భావోద్వేగానికి గురైనట్లు డాక్టర్ విశ్వరాజ్ తెలిపారు. బాధిత వ్యక్తిని ఎమర్జెన్సీ సిబ్బందికి అప్పగించినప్పుడు అతడి కళ్లు చెమర్చాయని.. మీకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన చెప్పినట్లు వెల్లడించారు. ఈ ఘటన చాలా ఉద్వేగభరితమైనదని.. దీనిని జీవితాంతం గుర్తుంచుకుంటానంటూ విశ్వరాజ్ భావోద్వేగానికి గురయ్యారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.