Begin typing your search above and press return to search.

ఐటీ కంపెనీల క‌క్కుర్తి మాములుగా లేదుగా!

By:  Tupaki Desk   |   30 Nov 2018 10:19 AM IST
ఐటీ కంపెనీల క‌క్కుర్తి మాములుగా లేదుగా!
X
ఎంత తోపులైనా స‌రే.. వ్య‌వ‌స్థ త‌ర్వాత‌.. దేశం త‌ర్వాతే అన్న విష‌యాన్ని అస్స‌లు మిస్ కాకూడ‌దు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో కీల‌కంగా మారిన వేళ‌.. గ‌తానికి మించి వ‌ర్త‌మానంలో ఐటీ కంపెనీల‌కు ప్ర‌భుత్వాలు.. వ్య‌వ‌స్థ‌లు ఇస్తున్న మ‌ర్యాద‌.. గౌర‌వం అంతా ఇంతా కాదు.

సామాన్యుల‌తోనూ.. మిగిలిన రంగాల‌తో పోలిస్తే.. ఐటీ కంపెనీల విష‌యంలో ప్ర‌భుత్వ యంత్రాంగానికి ఒకింత సాఫ్ట్ కార్న‌ర్ ఎక్కువ‌నే చెప్పాలి. మ‌రి.. అలాంటి ప‌రిస్థితుల్లో ఐటీ కంపెనీలు ఎలా స్పందించాల్సి ఉంటుంది? కీల‌క‌మైన ఎన్నిక‌ల పోలింగ్ వేళ‌.. కంపెనీలు స్వ‌చ్ఛందంగా సెల‌వును ప్ర‌క‌టించాల్సింది పోయి.. త‌మ క్ల‌యింట్స్ కు ఇబ్బందులు క‌లుగుతాయ‌న్న పేరుతో అనుస‌రిస్తున్న వైనం ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు తావిచ్చేలా ఉంది.

తెలంగాణ‌లో జ‌రిగే అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌లు వ‌చ్చే నెల 7న జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ రోజున అంద‌రికి సెల‌వును ప్ర‌క‌టించారు. కానీ.. త‌మ క్ల‌యింట్స్ కు అందించాల్సిన సేవ‌ల విష‌యంలో ఇబ్బందులు క‌లుగుతాయ‌న్న పేరుతో పోలింగ్ రోజున సెలవు ఇవ్వ‌ని ఐటీ కంపెనీలు..ప్రైవేటు కంపెనీలు బోలెడ‌న్ని. అదే జ‌రిగితే.. పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం త‌గ్గిపోయే ప్ర‌మాదం ఉంది. దీన్ని నివారించేందుకు ఐటీ కంపెనీల‌కు చెందిన ప్ర‌ముఖుల్ని తెలంగాణ ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధానాధికారి ర‌జ‌త్ కుమార్ ఒక స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సంద‌ర్భంగా ఐటీ కంపెనీల ప్ర‌ముఖులు వ్య‌వ‌హ‌రించిన తీరు ఒళ్లు మండేలా చేయ‌ట‌మే కాదు.. వారి కక్కుర్తి అవాక్కు అయ్యేలా ఉంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. అలివి కాని డిమాండ్ల‌ను తెర మీద‌కు తీసుకురావ‌ట‌మే కాదు.. ఇత‌ర దేశాల్లో జ‌రిగే ఎన్నిక‌ల‌తో పోల్చి చూపిస్తూ.. విమ‌ర్శ‌లు చేసిన తీరు ర‌జ‌త్ కుమార్‌ ను సైతం ఇబ్బందికి గురి చేసిన‌ట్లుగా చెప్పాలి.

ఈ కార‌ణంతోనే ఐటీ కంపెనీల ప్ర‌తినిధుల మాట‌ల‌తో విభేదించిన ర‌జ‌త్ కుమార్‌.. ఓటు వేసే బాధ్య‌త‌ను ప‌క్క‌న పెట్టి మ‌న దేశ వ్య‌వ‌స్థ‌ను విదేశాల‌తో పోల్చి బాగోలేద‌ని చెప్ప‌టం స‌రికాదంటూ ఆయ‌న కూసింత అసంతృప్తితో వ్యాఖ్య‌లు చేయ‌టం ఒక నిద‌ర్శ‌నంగా చెప్పాలి.

ఇదే మీటింగ్ లో పాల్గొన్న రాచ‌కొండ సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ మాట్లాడుతూ.. 2014 ఎన్నిక‌ల్లో ఒక అభ్య‌ర్థి కేవ‌లం 43 ఓట్ల తేడాతో గెల‌వ‌టాన్ని ప్ర‌స్తావిస్తూ.. ప్ర‌తి ఓటు ఎంత కీల‌కమ‌న్న విష‌యాన్ని మ‌రింత అర్థ‌మ‌య్యేలా చెప్పుకొచ్చారు. ప్ర‌జాస్వామ్యంలో ఓటు విలువ‌ను చెప్పేందుకు కీల‌క అధికారులు ప్ర‌య‌త్నించినా.. ఐటీ కంపెనీల ప్ర‌ముఖులు మాత్రం త‌మ వాద‌న నుంచి బ‌య‌ట‌కు రాలేదన్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ఓటు వేయండి.. మీ కంపెనీ ఉద్యోగుల చేత ఓటు వేయించ‌టం మ‌ర్చిపోవ‌ద్ద‌ని సీనియ‌ర్ అధికారులు చెప్పే ప్ర‌య‌త్నం చేస్తే.. దానికి రివ‌ర్స్ గేర్ లో ఐటీ కంపెనీల ప్ర‌తినిదులు.. త‌మ‌కు విదేశీ క్ల‌యింట్స్ ఉంటార‌ని.. వారి ప‌ని వేళ‌ల‌కు వీలుగా త‌మ వ‌ర‌కూ పూర్తి సెల‌వు ప్ర‌క‌టించ‌కుండా.. మిన‌హాయింపులు ఇవ్వాల‌న్న వాద‌న‌ను వినిపించ‌టం గ‌మ‌నార్హం. అంతే కాదు.. ఓటు వేసేందుకు వీలుగా త‌మ కంపెనీల్లోనే పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేయాల‌న్న సిత్ర‌మైన వాద‌న‌ను వినిపించారు. ఇదంతా చూసిన‌ప్పుడు.. ఐటీ.. బీటీ అన్న తేడా లేకుండా రూల్ అంటే రూల్ అన్న‌ట్లుగా క‌రాఖండిగా ప్ర‌భుత్వ ఆదేశాల్ని పాటించాల్సిందేన‌న్న మాట‌ను చెప్ప‌టం ఏ మాత్రం త‌ప్పు కాద‌న్న భావ‌నకు రావ‌టం ఖాయం. పాల‌కుల్ని ఎన్నుకునేందుకు ఏళ్ల త‌ర‌బ‌డి స్వాంత్య్ర పోరాటం చేసిన దానికి భిన్నంగా.. ఇప్పుడు విదేశీ క్ల‌యింట్ల‌ను సంతృప్తిప‌ర్చ‌టానికి ప‌డుతున్న పాట్లు చూస్తే.. కంపెనీల వాణిజ్య ధోర‌ణి మీద అస‌హ్యం క‌లుగ‌క మాన‌దు.