Begin typing your search above and press return to search.

ఇద్దరు ప్రాణాలు తీసిన పాతబస్తీ పేలుడు.. అసలు కారణం ఇదేనా?

By:  Tupaki Desk   |   5 Nov 2021 4:09 AM GMT
ఇద్దరు ప్రాణాలు తీసిన పాతబస్తీ పేలుడు.. అసలు కారణం ఇదేనా?
X
దీపావళి వేళ.. హైదరాబాద్ పాతబస్తీలో చోటు చేసుకున్న భారీ పేలుడు రెండు ప్రాణాలు పోయేలా చేసింది. ఈ పేలుడుకు కారణం.. దీపావళి బాణసంచాను పేల్చటమేనని చెబుతున్నారు. ఎంత టపాసులు పేలితే మాత్రం ఇద్దరు చనిపోయేంత తీవ్రత ఉంటుందా? అన్నది ప్రశ్నగా మారింది. అయితే.. టపాసులకు కొన్ని రసాయనాలు అదనంగా చేర్చటంతోనే ఈ దారుణం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ.. ఈ పేలుడు ఎలా చోటు చేసుకుంది? అసలేం జరిగింది? అన్న విషయంలోకి వెళితే..

ఛత్రినాక పరిధిలోని కందికల్గేట్ వద్ద గురువారం రాత్రి భారీ పేలుడు చోటు చేసుకుంది. పెద్ద శబ్ధంతో స్థానికులు హడలిపోయారు. అనంతరం పెద్ద ఎత్తున అరుపులు.. కేకలతో వారు అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణిస్తే.. మరొకరు తీవ్రగాయాల పాలై.. చికిత్స పొందుతూ మరణించారు. మరణించిన ఇద్దరూ పశ్చిమ బెంగాల్ కు చెందిన పాతికేళ్ల విష్ణు.. 30 ఏళ్ల జగన్నాథ్ గా గుర్తించారు.

వీరు విగ్రహాల్ని తయారుచేసేందుకు వినియోగించే పీవోసీ కర్మాగారంలో పని చేస్తుంటారు. పీవోపీతో విగ్రహాల్ని తయారు చేసే పరిశ్రమలో పని చేసే ఈ ఇద్దరుకార్మికులు.. దీపావళి టపాసులకు.. సంస్థలోని రసాయనాల్ని కలిపి వినియోగించటంతో పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉందని.. అందుకే ఇంతలా ప్రాణనష్టం వాటిల్లినట్లుగా చెబుతున్నారు. ఈ పేలుడు గురించి తెలిసినంతనే ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారు.