Begin typing your search above and press return to search.

వైసీపీ స‌ర్కారుకు ఊహించ‌ని షాక్‌.. ఎన్నిక‌ల ముందు తాడోపేడో!

By:  Tupaki Desk   |   6 Dec 2022 9:30 AM GMT
వైసీపీ స‌ర్కారుకు ఊహించ‌ని షాక్‌.. ఎన్నిక‌ల ముందు తాడోపేడో!
X
ఏపీలోని వైసీపీ స‌ర్కారుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఉద్యోగుల విష‌యంలో ప్ర‌భుత్వం ఆది నుంచి అనుమానిస్తున్న విధంగానే ఇప్పుడు ప‌రిణామాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. త‌మ‌పై పెత్త‌నం చేస్తున్నట్టు భావిస్తున్న ఉద్యోగులు.. స‌ర్కారుకు పెద్ద షాక్ ఇచ్చారు. సీపీఎస్ ర‌ద్దు చేయాల‌న్న పంతాన్ని నెగ్గించుకునేందుకే.. వారు సిద్ధ‌మ‌య్యారు. ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ ఇచ్చిన హామీ ని అమ‌లు చేయాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు.

దీంతో ఇప్పుడు వైసీపీకి మ‌రో పెద్ద స‌మ‌స్య త‌ల‌మీద‌కు వ‌చ్చిన‌ట్టు అయింది. గ‌త ఏడాదిన్న‌ర‌గా సీపీఎస్ పింఛ‌న్ విధానాన్ని ర‌ద్దు చేయాల‌ని ఉద్యోగులు కోరుతున్నారు.అయితే, దీని వ‌ల్ల కొత్త స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. సీఎం జ‌గ‌న్ హామీ ఇచ్చారు క‌దా! అంటే.. తెలియ‌క ఇచ్చిన పొర‌పాట‌ని తేల్చి చెప్పి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేసింది. అయితే.. ఇది ప్ర‌భుత్వం అనుకున్నంత ఈజీగా అయితే స‌మ‌సిపోలేదు.

ఉద్యోగులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వానికి షాక్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనిని గ‌మ‌నించిన ప్ర‌భుత్వం తాజాగా వారిని మ‌ళ్లీ న‌యానో.. భ‌యానో.. బుజ్జ‌గించేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఈ క్ర‌మంలోనే తాజాగా సీపీఎస్ అంశంపై చర్చలకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఉద్యోగ సంఘాలను ఆహ్వానించింది.

మంగ‌ళ‌వారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ చర్చలు జరుగనున్నట్టు ఆర్ధికశాఖ ప్రకటించింది.

రాష్ట్రంలోని 20 ఉద్యోగ సంఘాల నేతలు, ప్రతినిధులకు ఆర్ధికశాఖ సమాచారం పంపింది. ప్రధాన ఉద్యోగ సంఘాలతో పాటు ఉపాధ్యాయ సంఘాలు, సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్లనూ ప్రభుత్వం చర్చలకు పిలిచింది.

అయితే.. ఈ స‌మావేశానికి తాము వ‌చ్చేది లేద‌ని.. సంఘాలు స్ప‌ష్టం చేశాయి. అమ‌రావ‌తి జేఏసీ స‌హా సెక్ర‌టేరియెట్ ఉద్యోగ సంఘం కూడా ఇదే చెప్పింది. సీపీఎస్ ను ర‌ద్దు చేస్తామ‌నే వ‌ర‌కు ఎలాంటి చ‌ర్చ‌ల‌కు వ‌చ్చేది లేద‌ని తెలిపింది. దీంతో ఈ ప‌రిణామం స‌ర్కారుకు ఇబ్బందిగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.