Begin typing your search above and press return to search.

ఆనం సోద‌రుల‌కు ఆదిలోనే షాక్‌....

By:  Tupaki Desk   |   7 Aug 2015 5:06 PM GMT
ఆనం సోద‌రుల‌కు ఆదిలోనే షాక్‌....
X
వైసీపీలో చేరాలని భావించిన ఆనం సోదరులకు ఆదిలోనే షాక్ త‌గిలే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. వైసీపీ అగ్ర‌నేత‌ బొత్స రాయబారంతో వైసీపీలో చేరేందుకు మహూర్తం నిర్ణ‌యించుకున్న ఈ నెల్లూరు నేత‌ల‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌నే చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఈ నెల 17న కార్యకర్తల సమావేశం నిర్వహించి నెలాఖరులో వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని ఆనం సోద‌రులు డిసైడ్ అయ్యారు. అయితే వైసీపీలో చేరడం ఆనం వివేకానందరెడ్డికి ఇష్టం లేకపోయినప్పటికి రామనారాయణ రెడ్డి గట్టిగా పట్టుబట్టారని టాక్ వినిపిస్తోంది.

మ‌రోవైపు భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం ఆనం సోదరులను వైసీపీ అధినేత జగన్ పార్టీ లోకి తీసుకున్నా ఇప్పటికే పార్టీలో ఉన్న జిల్లా నేతలు వీరి రాకను ఎంత వరకు స్వాగతిస్తారో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలుతోంది. ఆనం సోదరులను విభేదించి వైసీపీలో కి వచ్చి ఎమ్మెల్యేలుగా గెలిచిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి, నెల్లూరు సిటి ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు వీరిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెబుతున్నారు. వీరే కాకా జిల్లా పార్టీలో కీలక నేతలుగా ఉన్న మేకపాటి కుటుంబం వీరిని వ్యతిరేకించే పరిస్థితి ఉందని అంటున్నారు.

అయితే...జగన్ అంచ‌నాలు వేరేగా ఉన్నాయ‌ని తెలుస్తోంది. రాబోయే ఏడాదిన్నర కాలంలో జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో ఇప్పటి ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఓడించాలంటే ఆనం రామనారాయణ రెడ్డికే సాద్యమవుతుందని.. పైగా ఆనం ఆర్థికంగా అండగా ఉంటారని జ‌గ‌న్ భావిస్తున్నారు. అయితే, ఆనం సోదరులు వైసీపీలోకి వస్తే వైసీపీలో ఉన్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడి అధికార పార్టీలో చేరుతారన్న ప్రచారం కూడా నెల్లూరులో జోరుగా వినిపిస్తుంది.