Begin typing your search above and press return to search.

బాబుకు మ‌రో డ‌బుల్ షాక్ త‌ప్ప‌దా?

By:  Tupaki Desk   |   4 Aug 2017 9:22 AM GMT
బాబుకు మ‌రో డ‌బుల్ షాక్ త‌ప్ప‌దా?
X
ఏపీలో అధికార పార్టీ టీడీపీకి దెబ్బ మీద దెబ్బ త‌గల‌డం ఖాయ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక‌కు ముందుగా టీడీపీకి ఊహించ‌ని షాకిచ్చిన మాజీ మంత్రి శిల్పా మోహ‌న్ రెడ్డి... వైసీపీలో చేరిపోయారు. తాజాగా నిన్న శిల్పా సోద‌రుడు శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి కూడా టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడుకు గ‌ట్టి షాకిస్తూ... ఎమ్మెల్సీ ప‌ద‌వికి ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో రాజీనామా చేసి మ‌రీ వైసీపీలో చేరిపోయారు. పార్టీ మారే నేత‌ల‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రేగ‌డం స‌ర్వ సాధార‌ణ‌మే. అయితే త‌మ‌కు ఝ‌ల‌క్కిచ్చి వైసీపీలో చేరిపోయిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డిపై సింగిల్ ఆరోప‌ణ కూడా చేసే వీలు లేకుండా పోయింద‌న్న కోణంలో టీడీపీ నేత‌లు నానా ఇబ్బందులు ప‌డిపోతున్నార‌ని జ‌నం చెవులు కొరుక్కుంటున్న విష‌యం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

టీడీపీ టికెట్‌ పై ద‌క్కిన ఎమ్మెల్సీ ప‌ద‌వి త‌న‌కు ఏమాత్రం అవ‌స‌రం లేద‌ని, నిన్న నంద్యాల‌లో జ‌రిగిన జ‌గ‌న్ స‌మ‌ర‌భేరీలో జ‌నం సాక్షిగా ఆ ప‌ద‌వికి శిల్పా రాజీనామా చేసి దానిని జ‌గ‌న్ చేతిలో పెట్టేశారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు అటు శిల్పాతో పాటు ఇటు ప్ర‌జ‌ల్లోనూ కొత్త ఉత్సాహం నింపింద‌నే చెప్పాలి. పార్టీ ఫిరాయింపుల‌కు త‌న‌దైన రీతిలో బుద్ధి చెప్పిన శిల్పా... నిజంగానే పులి అని, ఆయ‌న‌న‌ను సింహంతో పోల్చినా త‌క్కువేన‌ని జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు నిజంగానే టీడీపీకి నోట మాట రానీయ‌లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇదంతా నిన్న జ‌రిగిన వ్య‌వ‌హార‌మైతే... శిల్పా బ్ర‌ద‌ర్స్ మాదిరే ఇప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం సోద‌రులు కూడా పార్టీ యోచ‌న‌లో ఉన్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

శిల్పా సోద‌రుల్లాగే... ఆనం బ్ర‌ద‌ర్స్ కూడా నెల్లూరు రాజ‌కీయాల్లో కీల‌క నేత‌ల‌నే చెప్పాలి. మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి - ఆయ‌న సోద‌రుడు ఆనం వివేకానంద‌రెడ్డిలు తొలుత కాంగ్రెస్ పార్టీ నేతలుగా ఉన్న విష‌యం తెలిసిందే. దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సీఎంగా ఉండ‌గా... ఆనంకు కీల‌క మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. వైఎస్ కేబినెట్ లో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ఓ వెలుగు వెల‌గ‌గా, ఆనం వివేకా కూడా కీల‌కంగానే వ్య‌వ‌హ‌రించారు. ఆ దెబ్బతో నెల్లూరు జిల్లాలో ఆనం బ్ర‌ద‌ర్స్ తిరుగులేని నేత‌లుగా ఎదిగార‌నే చెప్పాలి. అయితే రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ అడ్రెస్ గ‌ల్లంతు కాగా... ఆ ప్ర‌భావం ఆనం బ్ర‌ద‌ర్స్‌ పైనా ప‌డింది. ఫ‌లితంగా ఆనం బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రూ టీడీపీ కండువా క‌ప్పేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారికి మంచి ప్రాధాన్యం ఇస్తామ‌ని నాడు చంద్రబాబు వారికి గ‌ట్టి హామీ ఇచ్చార‌ని స‌మాచారం.

ఆనం వివేకాకు ఎమ్మెల్సీ ప‌ద‌వితో పాటు ఆనంకు ఆత్మ‌కూరు నియోజ‌వ‌క‌ర్గ ఇన్‌ చార్జీ ప‌ద‌వి ఇవ్వాల‌నేది నాడు కుదిరిన ఒప్పందంగా చెబుతున్నారు. అంతేకాకుండా చంద్ర‌బాబు కేబినెట్‌ లోనూ ఓ పోస్టును ఆనం బ్ర‌ద‌ర్స్‌కు ఇస్తామ‌ని హామీ ల‌భించింద‌ని కూడా తెలుస్తోంది. అయితే ఈ హామీలేమీ ఇప్ప‌టిదాకా నెర‌వేరిన దాఖలా క‌నిపించ‌లేదు. ఈ క్ర‌మంలోనే మొన్న ఆనం వివేకా త‌న అసంతృప్తిని బ‌హిరంగంగానే వెళ్ల‌గ‌క్కిన విష‌యం తెలిసిందే. తాజాగా ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌ను మాజీ మంత్రులు ఎన్ ఎండీ ఫ‌రూక్‌, రామ‌సుబ్బారెడ్డిల‌కు ఇచ్చేయ‌డంతో ఆనం బ్ర‌దర్స్‌కు ఇప్పుడిప్పుడే ప‌ద‌వులు ద‌క్కే ఛాన్స్ క‌నిపించ‌డం లేదు. దీంతో ఆనం బ్ర‌ద‌ర్స్ వైసీపీ వైపు చూస్తున్నార‌న్న విష‌యం తెలియ‌డంతో టీడీపీ అధిష్ఠానం షాక్ తిన్న‌ది.

వారిద్ద‌రినీ బుజ్జ‌గించే స్థాయి ఉన్న నేత‌లు ఎవ‌రూ క‌నిపించ‌ని నేప‌థ్యంలో నేరుగా చంద్ర‌బాబే రంగంలోకి దిగార‌ట‌. ప్ర‌స్తుతం టీడీపీ ఏపీ అధ్య‌క్షుడిగా ఉన్న కిమిడి క‌ళా వెంక‌ట్రావు మొన్న‌టి కేబినెట్ విస్త‌ర‌ణ‌లో మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన నేప‌థ్యంలో పార్టీ ఏపీ అధ్య‌క్ష ప‌ద‌వి ఖాళీ కానుంది. దీంతో ఆ ప‌ద‌విని ఇస్తాన‌ని ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి చంద్ర‌బాబు చెప్పార‌ట‌. అయితే పార్టీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి త‌మ‌కేమీ అవ‌స‌రం లేద‌ని, ఎమ్మెల్సీ ప‌ద‌వితో పాటు కేబినెట్ లో మంత్రి ప‌ద‌వి ఇస్తే... పార్టీ మారే విష‌యాన్ని ప‌క్క‌న‌బెడ‌తామ‌ని ఆనం బ్ర‌ద‌ర్స్ చంద్ర‌బాబు ముఖం మీదే చెప్పేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆనం బ్ర‌ద‌ర్స్ డిమాండ్ చేసిన మేర‌కు ప‌ద‌వులిచ్చే ప‌రిస్థితి ద‌రిదాపుల్లో క‌నిపించ‌డం లేదు. దీంతో ఆనం బ్ర‌ద‌ర్స్ వైసీపీలోకి మారిపోయే ఛాన్సే అధికంగా ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇదే జ‌రిగితే... నంద్యాల త‌ర‌హాలోనే నెల్లూరులోనూ చంద్ర‌బాబు అండ్ కోకు డ‌బుల్ షాక్ త‌ప్ప‌ద‌న్న మాట‌.