Begin typing your search above and press return to search.

టీడీపీలోకి వ‌చ్చి త‌ప్పు చేశాం

By:  Tupaki Desk   |   26 Nov 2017 6:07 AM GMT
టీడీపీలోకి వ‌చ్చి త‌ప్పు చేశాం
X
కొంత గ్యాప్ త‌ర్వాత తెర‌మీద‌కు వ‌చ్చిన‌ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి మ‌రోమారు త‌న‌దైన శైలిలో క‌ల‌కలం రేపే కామెంట్లు చేశారు. అయితే ఈ ద‌ఫా ఏపీ విప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్‌పై కాకుండా సొంత పార్టీ నేతల‌పై వివేక‌ ఫైర్ అయ్యారు. గ‌తంలో తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడంతో నాడు అలిగారని, వైసీపీలో చేరనున్నార‌ని ప్ర‌చారం జ‌రగటం..అయితే పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి చ‌ర్చించి వారిని బుజ్జ‌గించ‌డం తెలిసిందే. అయితే ఈ అసంతృప్తి స‌ద్దుమ‌ణిగింద‌నే ద‌శ‌లో..త‌నకు, త‌న సోదరుడు రామ‌నారాయ‌ణ‌రెడ్డికి పార్టీలో స‌రైన గౌర‌వం ద‌క్క‌డం లేద‌ని పార్టీ నేత‌ల‌తో వాపోయిన‌ట్లు స‌మాచారం.

పార్టీ వ‌ర్గాల్లో జరుగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం త‌న ఇంటికి వ‌చ్చిన నేత‌ల వ‌ద్ద‌...ఆనం వివేకా త‌న ఆవేద‌న‌ను, ఆందోళ‌న‌ను వెళ్ల‌డించార‌ని స‌మాచారం. మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిలు వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ అధిష్టానంపై ఆనం వివేకానంద ఘాటు విమర్శలు చేసిందని అంటున్నారు. పార్టీలో తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. `టీడీపీలో చేరి తప్పు చేశాం బ్రదర్.. ఒకరకంగా మోసపోయాం. ఎన్ని అవమానాలను భరిస్తాం..? రాజకీయాల్లో ఎప్పుడూ ఇలా జరగలేదు.. ఎవరెవరికో పదవులు ఇస్తున్నారు. మాకు ఏంటి ఇలాంటి ప‌రిస్థితి` అంటూ త‌న మ‌న‌సులోని ఆవేద‌న‌నంతా ఆయన వెల్ల‌డించార‌ని తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా త‌మ‌కు కాంగ్రెస్ పార్టీలో ద‌క్కిన గౌర‌వం, టీడీపీలో ప‌ట్టించుకోని త‌నం గురించి నేత‌ల వ‌ద్ద ఒకింత ఫిర్యాదు లాగా చెప్పిన‌ట్లు స‌మాచారం.

కాగా, ఆనం సోద‌రుల అసంతృప్తి వార్త టీడీపీ నేత‌ల్లో క‌ల‌వ‌రానికి దారితీసింద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ఒక‌వైపు ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్రతో వైసీపీ నేత‌ల్లో కొత్త ఉత్సాహం వ‌స్తోంద‌ని ఈ స‌మయంలో సీనియ‌ర్ నేత‌ల అసంతృప్తి..మ‌రో పార్టీపై పక్క‌చూపులు వేయ‌డం ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తుందో అని పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది.