Begin typing your search above and press return to search.

టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఆనం?

By:  Tupaki Desk   |   1 Aug 2017 5:03 PM GMT
టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఆనం?
X
తెలుగుదేశం పార్టీ సంస్థాగ‌త క‌మిటీల్లో కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, ఆ పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆనం రామనారాయణరెడ్డి నియమితులు కానున్నట్లు విశ్వసనీయ రాజకీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్న కళావెంకట్రావ్‌ కు నాలుగు మాసాల క్రితం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ పునర్యవస్థీకరణతో అమాత్య హోదా దక్కింది. దీంతో అప్పటి నుంచి అటు సచివునిగా, ఇటు పార్టీ రాష్ట్ర అధ్యక్ష హోదాతో జోడు పదవుల్లో ఆయన కొనసాగుతున్నారు. అయితే పార్టీపరంగా అసంతృప్తుల్ని బుజ్జగించే క్రమంలో ఆనంకు ఈ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ పార్టీ జాతీయ అధ్యక్ష- ప్రధాన కార్యదర్శులైన తండ్రీ తనయులు సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆనంను నియమించడం లాంఛనప్రాయమేనంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆనం సోదరులు 2015 నవంబర్‌ లో తెలుగుదేశం పార్టీలోకి పునఃప్రవేశం చేశారు. ఆ సందర్భంలో పార్టీ అధినేత నుంచి ఓ ఎమ్మెల్సీ నజరానా హామీ లభించిందని ప్రచారం. అయితే ఈ ఏడాదిలో జరిగిన దైవార్షిక ఎమ్మెల్సీ ఎన్నిక, ఎంపికల్లో అవకాశం దక్కుతుందని ఆనం సోదరులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఈ అవకాశం కూడా దారి తప్పడంతో షాక్ తిన్నారు. దీంతో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్ష పదవి ఆనంకు కట్టబెట్టడం ద్వారా సముచిత గౌరవం కల్పించినట్లవుతుందనే అంచనాకు వస్తున్నారు. ఇంతేగాకుండా తెలుగుదేశం అంటే కమ్మ సామాజికవర్గ పార్టీగా రాజకీయ ముద్ర పడుతుండటం తెలిసిందే. అదే సందర్భంలో తెలుగుదేశానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ అంటే రెడ్డి కులానికి పట్టున్న పార్టీగా భావిస్తున్న నేపథ్యంలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఆనం రామనారాయణకు రాష్ట్ర అధ్యక్షుడి పదవి కట్టబెట్టడంతో ఆ కులం నుంచి కూడా కొంతమేర సానుకూలత పొందాలనే నిర్ణయంగా కూడా భావిస్తున్నారు.

కొద్దిమాసాల క్రితం నెల్లూరుజిల్లా అధ్యక్షునిగా ఆనం నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. శాసనమండలి సభ్యత్వం పొందని వైనంతో ఏకంగా రాష్ట్ర అధ్యక్షునిగానే అవకాశం కలుగుతుందనే విశ్లేష‌ణలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇంతేగాకుండా ఆనం రామనారాయణరెడ్డికి రాజకీయంగా పరిచ‌యాలు ఉండ‌టం క‌లిసివ‌చ్చే అంశంగా చెప్తున్నారు. గ‌త‌దాదాపుగా ఎనిమిది సంవత్సరాలపాటు వివిధ శాఖలకు అమాత్య హోదాలో రాణించారు. ఇక అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ తుదినాళ్లలో అయితే సీఎం తరువాత అంతటి హోదాగా భావించే ఆర్థికశాఖ సచివునిగా వ్యవహరించడంతో రాజకీయవర్గాల్లో ప్రాముఖ్యత పొందారు. మొత్తమీద రాష్ట్ర కమిటీ అధ్యక్షునిగా ఆనం అయితేనే సరితూగే నాయకుడనే భావనకు చంద్రబాబునాయుడు వచ్చినట్లుగా తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక నిర్వహించేలోగా ఈ ప్రకటన ఉంటుందా లేక ఆ తరువాత వెల్లడిస్తారా అనేది వేచి చూడాలని టీడీపీ వ‌ర్గాలు అంటున్నాయి.