Begin typing your search above and press return to search.

టిక్కెట్ రాదని తెలిశాకే వైసీపీ నేత ఇలా మారిపోయారా?

By:  Tupaki Desk   |   31 Dec 2021 2:30 AM GMT
టిక్కెట్ రాదని తెలిశాకే వైసీపీ నేత ఇలా మారిపోయారా?
X
నిత్య అసంతృప్త ఎంఎల్ఏ ఆనం రామనారాయణ రెడ్డి పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటగిరిలో పోలీసు బెటాలియన్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం సందర్భంగా మాట్లాడుతూ లోకల్ మాఫియాతో పోలీసులు కుమ్మక్కయ్యారంటు ఆరోపణలు చేశారు. లోకల్ మాఫియాతో పోలీసులు కుమ్మక్కయితే ఇక మామూలు జనాలకు భద్రత ఎక్కడుంటుందంటు ప్రశ్నించారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గిందన్నారు.

అయితే ఇదే సమయంలో ఇంకా కంటిన్యూ అవుతున్న మాఫియా మాటేమిటి ? అంటూ నిలదీశారు. పోయిన ప్రభుత్వంలో ఉన్న మాఫియా ఈ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ అవుతోందన్నారు. ఇలాంటి మాఫియాతో ఇబ్బందులు పడుతున్న జనాలు రక్షణ కోసం పోలీసులను ఆశ్రయిస్తారన్న విషయాన్ని ఎంఎల్ఏ గుర్తుచేశారు. రక్షణ కోసం వచ్చిన మామూలు జనాలను వదిలేసి పోలీసులు మాఫియాతో కుమ్మక్కు కావటం ఏమిటంటు నిలదీశారు.

ఇన్ని మాటలు మాట్లాడిన ఆనం మాఫియాతో కుమ్మక్కైన పోలీసులు ఎవరో మాత్రం చెప్పలేదు. తన ఆరోపణలకు తగిన ఆధారాలను కూడా చూపించలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వంపై ఆనం నిత్య అసంతృప్త వాదిగా మారిపోయారు. తనకు సరైన గౌరవం ఇవ్వటం లేదని, స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రోటోకాల్ పాటించి ఆహ్వానం పంపలేదని, మంత్రులు తన సలహాలు తీసుకోవటం లేదనే ఏదో కారణంతో పార్టీ, ప్రభుత్వంపై అలుగుతునే ఉన్నారు.

ఆనం అలకకు అసలు కారణం ఏమిటంటే తనకు మంత్రిపదవి ఇవ్వకుండా తనకన్నా జూనియర్లను జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకోవటమే. ఆనంను బుజ్జగించడానికి జగన్ ఏనాడు ప్రయత్నించలేదు. నిజానికి ఆనంను వైసీపీలోకి చేర్చుకోవటమే చాలా ఎక్కువ. టీడీపీలో ఉండలేక వైసీపీలో చేర్చుకోమని బతిమలాడుకుంటే జగన్ చివరకు సరే అన్నారని బాగా ప్రచారంలో ఉంది. పోటీచేయటానికి ఎక్కడో అక్కడ టికెట్ ఇస్తే చాలంటే వెంకటగిరిలో పోటీచేయించారు.

అలాంటిది గెలిచిన దగ్గర నుంచి మంత్రి పదవి ఇవ్వలేదని అలగటం, తన మాట చెల్లుబాటు కావడం లేదన్న కోపంతో నోటికొచ్చింది మాట్లాడటం ఆనంకు అలవాటైపోయింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఆనంకు మళ్ళీ టికెట్ ఇచ్చేది కూడా అనుమానమే అన్నట్లుంది. ఇలాంటి పరిస్దితిల్లో వాస్తవాలను గమనించుకోకుండా ప్రతిపక్ష నేతలు మాట్లాడినట్లు బహిరంగంగా ప్రభుత్వంపైన వ్యతిరేకంగా మాట్లాడటం అలవాటైపోయింది.