Begin typing your search above and press return to search.

పెద్ద‌ల స‌భ‌కు య‌న‌మ‌ల‌...ఆనంకు ఆర్థిక శాఖ‌?

By:  Tupaki Desk   |   22 Oct 2017 7:42 AM GMT
పెద్ద‌ల స‌భ‌కు య‌న‌మ‌ల‌...ఆనంకు ఆర్థిక శాఖ‌?
X
రాబోయే ఎన్నిక‌ల‌లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా టీడీపీ పావులు క‌దుపుతోంది. ఏడాదిన్నర‌లో రాబోతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొని కేబినెట్ లో మార్పులు చేర్పులు చేయాల‌ని టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు భావిస్తున్నారు. అన్ని జిల్లాల‌వారికి స‌మ ప్రాధాన్యం ల‌భించేలా కేబినెట్ విస్త‌ర‌ణ చేప‌ట్టే యోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభ‌జ‌నానంత‌ర ప‌రిస్థితుల నేప‌థ్యంలో వేరే పార్టీల నుంచి టీడీపీలో చేరిన వారికి కూడా కేబినెట్ లో చోటు క‌ల్పించాలనేది సీఎం ఆలోచ‌న అని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే ఆనం రామ నారాయణరెడ్డికి కేబినెట్ లో చోటు దక్కవ‌చ్చ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు - ప్ర‌స్తుత ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామకృష్ణుడిని రాజ్య‌సభ‌కు పంపాల‌నే యోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆనం రామ నారాయణరెడ్డి ...టీడీపీ ప్రధాన కార్యదర్శిగా కొన‌సాగుతున్నారు. ఒక‌వేళ అన్ని స‌మీక‌ర‌ణాలు బ్యాలెన్స్ అయి ఆనం రామ నారాయణ రెడ్డికి మంత్రి ప‌ద‌వి ద‌క్కితే....ఆయ‌న‌ ఆరు నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ గా గెలుపొందాలి. ప్ర‌స్తుతం అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే ప‌రిస్థితి లేదు గ‌నుక ఆనంకు ఎమ్మెల్సీ ఇచ్చే అవ‌కాశాలున్నాయ‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఉమ్మ‌డి ఏపీలో చివ‌రి ఆర్థిక శాఖ మంత్రిగా ప‌నిచేసిన ఆనంకు ఆర్థిక శాఖ‌ను కేటాయించే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి. ఆ సంద‌ర్భంలో యనమలను వచ్చే మార్చిలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో రాజ్యసభకు పంపాల‌ని టీడీపీ అధిష్టానం భావిస్తోంద‌ట‌. ఒక వేళ అందుకు య‌న‌మ‌ల సిద్ధంగా లేక‌పోతే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం నారాయణను క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) చైర్మన్ గా నియ‌మించి, ఆ స్థానంలో ఆనంను తీసుకోవాల‌ని యోచిస్తున్నార‌ట‌.

1985లో టీడీపీ త‌ర‌పున గెలుపొందిన ఆనం...ఎన్టీఆర్ క్యాబినెట్ లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత 1991లో కాంగ్రెస్ లో చేరారు. 2007లో వైఎస్ క్యాబినెట్ లో సమాచార శాఖ మంత్రిగా ప‌ని చేశారు. 2009లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ - పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా - ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ప‌ని చేశారు. విభ‌జ‌నానంత‌రం ఆనం సోదరులు టీడీపీకి దగ్గరయ్యారు. టీడీపీలో చేరినప్పుడే ఆనంకు ఎమ్మెల్సీ స్థానం ఇస్తామ‌ని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చింది. అయితే, కొన్ని కార‌ణాల వ‌ల్ల అది సాధ్య‌ప‌డ‌లేదు. దీంతో, ఆనం బ‌హిరంగంగానే త‌న ఆవేద‌న‌ను వెళ్ల‌గ‌క్కారు. నెల్లూరు జిల్లాలో ఆనం సోద‌రుల‌కు బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది. దీంతో, ఆ సోద‌రుల ఇమేజ్ ను క్యాష్ చేసుకోవాల‌ని టీడీపీ భావిస్తోంది. దీంతో, ఆనంకు మంత్రి ప‌ద‌వి త‌ప్ప‌క వ‌స్తుంద‌ని ఆనం వ‌ర్గీయులు భావిస్తున్నార‌ట‌. అయితే, రాబోయే ఎన్నిక‌ల నేప‌థ్యంలో మ‌రి , ఈ సారైన సుదీర్ఘ అనుభ‌వం ఉన్న ఆనం వంటి నేత‌కు టీడీపీలో స‌ముచిత గౌర‌వం క‌ల్పిస్తారో, లేదా వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ఈ నాన్చుడి ధోర‌ణిని కొన‌సాగిస్తారో వేచి చూడాలి.