Begin typing your search above and press return to search.

టీడీపీలో అంతర్యుద్ధం మొదలైంది..

By:  Tupaki Desk   |   19 May 2018 9:25 AM GMT
టీడీపీలో అంతర్యుద్ధం మొదలైంది..
X
ఆనం బ్రదర్స్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగిన నేతలు.. నెల్లూరు రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన వీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చేయడం.. ఆ పార్టీ ఏపీలో కనుమరగవడంతో రాజకీయ భవిష్యత్తు కోసం అధికార టీడీపీలో చేరారు.. కానీ ఈ కాంగ్రెస్ నేతలను బాబు అక్కున చేర్చుకోలేదు. కండువా కప్పాడు కానీ వారికి టీడీపీ ప్రాధాన్యం ఇవ్వలేదు.. ఆనం రాంనారాయణ రెడ్డికి మంత్రి పదవి - వివేకానందరెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పిన చంద్రబాబు అనంతరం వీరిద్దరి స్థానంలో గవర్నర్ కోటాలో రామసుబ్బారెడ్డి - ఎన్ ఎండీ ఫరూక్ లకు పదవులు కట్టబెట్టారు. ఆనం సోదరుల కంటే తక్కువ స్థాయి ఉన్న వీరికి పదవులు కట్టబెట్టడంతో రగిలిపోయిన ఆనం బ్రదర్స్ అప్పటి నుంచి టీడీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఇటీవల ఆనం వివేకానందరెడ్డి చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో ఉండగా అప్పటివరకు ఆస్పత్రిలో అన్న వద్ద ఉన్న రాంనారాయణ రెడ్డి... చంద్రబాబు వస్తున్నాడని తెలియగానే వెళ్లిపోయారట.. బాబు చేసిన అవమానాలను లోపలే దాచుకున్న ఆనం తాజాగా శనివారం ఆత్మకూరులో నిర్వహించిన మినీ మహానాడులో టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు.. టీడీపీ నాయకుడిగా ఉండి అదీ మహానాడులోనే తీవ్ర విమర్శలు చేశాడు.

రాంనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ‘35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు ఇన్ని అవమానాలు పడలేదని.. ప్రజల్లో టీడీపీ ప్రభుత్వంపై 80శాతం అసంతృప్తి ఉందని’ బాంబు పేల్చాడు. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నా.. జిల్లాలో వ్యవసాయ సమస్యలు పరిష్కారం కావడం లేదని.. ఆనం మండిపడ్డారు. మా సమస్యలు పట్టని ప్రభుత్వంలో మేము ఇంకా కొనసాగుతున్నామా అనే బాధ రైతుల్లో ఉందని.. వారు తిరుగుబాటు చేసే పరిస్థితి దగ్గర్లో ఉందని’ ఆనం తెలిపారు. మినీ మహానాడులో మనకు మనమే భజన చేసుకుంటున్నామని.. అధికార పార్టీకి చార్జింగ్ లేదని.. కేవలం జెండా పెట్టుకోవడానికే సరిపోతామా.. ప్రజా సమస్యలు తీర్చడానికి నేను పనికి రానా’ అని ఆనం వాపోయారు..

ఆనం వ్యాఖ్యలు చూశాక టీడీపీలో అసంతృప్త మొదలైందని చెప్పవచ్చు. టీడీపీలోని కింది స్థాయి కార్యకర్తలకు పదవులు, పార్టీలో గుర్తింపు లేదని తేటతెల్లమైంది. ఆ అసంతృప్తి జ్వాల టీడీపీని దహించే రోజులు తొందరలోనే ఉన్నట్టు ఆనం హెచ్చరికలతో నిరూపితమైంది. ఇన్నాళ్లుగా ఆనంలో గూడుకట్టుకొని ఉన్న అసంతృప్తి ఇప్పుడు బయటపడింది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉండడంతో ఆనం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరుతారనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ పార్టీపై తొలిసారి గళం విప్పిన ఆనంను చూసి మిగతా వారు గొంతెత్తి అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. టీడీపీ పాలనపై మొదలైన ఈ వ్యతిరేకత మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి మరి..