Begin typing your search above and press return to search.

టీడీపీలోకి ఆనం...క్లారిటీ వచ్చిందా...?

By:  Tupaki Desk   |   6 Dec 2022 4:31 AM GMT
టీడీపీలోకి ఆనం...క్లారిటీ వచ్చిందా...?
X
వైసీపీలో నెల్లూరుకి చెందిన పెద్దాయన రాజకీయ కలకలం ఎపుడూ రేపుతూనే ఉంటారు. ఆయన మాట్లాడరు కానీ ప్రచారం అయితే చాలానే జరుగుతూ ఉంటుంది. కాంగ్రెస్ టీడీపీ రాజకీయాలలో పనిచేసిన ఆనం వైసీపీలో ప్రస్తుతం ఉన్నారు. ఆయన వెంకటగిరి నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో గెలిచారు. మంత్రి పదవి గ్యారంటీ అనుకుంటే జగన్ షాకిచ్చారు. నాటి నుంచి ఆయన అన్యమనస్కంగానే పార్టీలో ఉంటున్నారు అన్నది ప్రచారం లో ఉన్న విషయం.

ఎప్పటికపుడు ఆనం టీడీపీలో చేరిపోతారు అని వార్తలను మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా వండి వార్చేస్తోంది. ఈ నేపధ్యంలో ఆనం వారు లేటెస్ట్ గా మీడియాకు ఒక క్లారిటీ ఇచ్చేశారు. తాను అయిదేళ్ళ పాటు ప్రజలు ఎన్నుకున్న వైసీపీ ఎమ్మెల్యేని అని ఆయన చెప్పడం విశేషం. తన మీద మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ వేరే విధమైన ఆలోచనలు చేసే వారి పనే అన్నట్లుగా మాట్లాడారు.

తాను వెంకటరిగి నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎమ్మెల్యేగా చివరి రోజు వరకూ పనిచేస్తాను అని చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలి అన్నది జగన్ నిర్ణయిస్తారని ఆయన చెప్పడం విశేషం. తన నాయకత్వంలో వెంకటగిరిలో వైసీపీ పార్టీ పనిచేస్తోందని ఆయన బల్లగుద్ది మరీ చెప్పారు. తనకు వేరే ఆలోచనలు లేవని, అలా ఉన్న నాడు ముందుగా కాగితం మీద రాసి ఆ తరువాత తానే దాన్ని చెబుతాను అని ఆనం చెప్పడమూ గమనార్హం.

అంటే తనకు వేరే ఆలోచనలు లేవు అని ఖండించి ఊరుకోకుండా ఉంటే చెబుతాను అని ఒక సంకేతం ఆనం ఇచ్చారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇక ఆనం వెంకటగిరి నియోజకవర్గం నుంచి మారిపోయి ఆత్మకూరు నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారు అని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న నేపధ్యంలో పెద్దాయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే ఆ క్లారిటీ ఏడాదిన్నరలో జరగబోయే ఎన్నికల వరకూ మాత్రమే.

ఆయన చెప్పినట్లుగా అంతవరకూ తాను వైసీపీ ఎమ్మెల్యేను అన్నారు. ఇక ఎక్కడ నుంచి పోటీ చేయించాలో జగన్ ఇష్టమన్నారు. అలా బంతిని జగన్ కోర్టులో ఆనం వేసి ప్రస్తుతానికి ఈ ప్రచారానికి బ్రేకులు వేశారు. అదే టైం లో ఊహాగానాలకు అవకాశాలూ ఇచ్చారు. ఏది ఏమైనా నెల్లూరు పెద్దాయన కదా. ఆయన రాజకీయ అనుభవం ముందు ఏ ప్రచారం అయినా డొల్లగా కొట్టుకుపోవడమే కదా జరిగేది. సో ఇపుడు అంతా ఆలోచించేది 2024 ఎన్నికల ముందు ఆనం ఏ పార్టీలో చేరుతారు అని. ప్రస్తుతానికి మాత్రం ఆనం వైసీపీయే అని ఆయన చెప్పేశారు కాబట్టి మీడియా వేరే రకంగా ప్రచారం మొదలెట్టాలన్న మాట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.