Begin typing your search above and press return to search.

టీడీపీ వైపు తొంగిచూస్తూ... లెక్క‌లు వేసుకుంటున్న ఆనం?!

By:  Tupaki Desk   |   24 Feb 2022 11:30 PM GMT
టీడీపీ వైపు తొంగిచూస్తూ... లెక్క‌లు వేసుకుంటున్న ఆనం?!
X
నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గ‌త కొద్దికాలంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ అధికార పార్టీకి కొర‌క‌రాని కొయ్య‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు జిల్లాల పునర్విభజన అంత అవసరమా అని ఆయన ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని బాహాటంగా ప్ర‌శ్నించారు.

అయితే, దీనికి కార‌ణం ఇప్ప‌టికే ఆనంలో గూడు క‌ట్టుకుపోయిన అసంతృప్తి మాత్ర‌మే కాద‌ని, తెలుగుదేశం పార్టీపై ఆయ‌న చూపు ప‌డ‌టం కూడా అని గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి.

కొత్త జిల్లాలు ఏర్పడితే వేల కోట్ల నిధులు కావాలని పేర్కొన్న ఆనం రామ‌నారాయ‌ణరెడ్డి తమకు మాత్రం రోడ్లు వేయడానికే నిధులు లేవని రాష్ట్ర ప్ర‌భుత్వం తీరుపై సెటైర్లు వేశారు. రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా చేసిన కాంగ్రెస్‌ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని.. ఇప్పుడు జనం మాట వినకుండా జిల్లా విభజన చేస్తే అధికార పార్టీకి కూడా అదే పరిస్థితి వస్తుందన్నారు.

ఆనం కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యం లేకుండా చేయాలన్న దురుద్దేశంతో నియోజకవర్గ విభజన చేసిన ఓ నేతకూ అదే గతి పట్టిందని సైతం ఆనం వ్యాఖ్యానించారు. నెల్లూరులో మూడు మండలాలను ఉంచకుంటే అలాంటి పోరాటాలు తప్పవని హెచ్చరించారు.

ఈ స్థాయిలో ఆనం అసంతృప్తి రాగం వినిపించ‌డం వెనుక ఇప్ప‌టికే వైసీపీకి చెందిన మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ విష‌యంలో ఉన్న అసంతృప్తి, సీనియ‌ర్ అయిన త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌నే అస‌హ‌నానికి తోడుగా కొత్త జిల్లాల నిర్ణ‌యంతో త‌మ ప‌ట్టు స‌డ‌లుతుంద‌నే భావ‌న కూడా అని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

ఇలా అన్ని ర‌కాలుగా త‌మ‌ను ఇర‌కాటంలో ప‌డేసినందుకే ఆనం చూపు టీడీపీ వైపు ప‌డింద‌ని చెప్తున్నారు. అయితే, టీడీపీలో సీనియ‌ర్ నేత‌గా ఉన్న సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి నుంచి త‌మ‌కు గ‌ట్టి పోటీ ఎదుర‌వ్వ‌చ్చ‌నే సందేహంలో సైతం ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ఉన్నార‌ని ఈ నేప‌థ్యంలో మంత్రి ప‌ద‌వి విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నుంచి ఒక‌వేళ‌ హామీ దొరికితే తెలుగుదేశం గూటికి చేర‌తార‌నే టాక్ వినిపిస్తోంది.