Begin typing your search above and press return to search.

అసలు నెల్లూరు జిల్లాలో ఏమవుతోంది ?

By:  Tupaki Desk   |   27 Jan 2021 2:30 PM GMT
అసలు నెల్లూరు జిల్లాలో ఏమవుతోంది ?
X
నెల్లూరు జిల్లాలోని ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి కంటిన్యు అవుతునే ఉంది. ఏదో ఒక కారణంతో ఎవరో ఒకరిపై ఎంఎల్ఏలు ఉన్నతాధికారులపై మండిపడుతునే ఉన్నారు. తాజాగా వెంకటగిరి నియోజకవర్గం ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి జిల్లా ఉన్నతాధికారులపై ఘాటు వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది. జనవరి 26వ తేదీన జరిగిన రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన వేడుకలకు జిల్లాలోని ఎంఎల్ఏలకు ఆహ్వానం లేదని మండిపడ్డారు.

ఇదే విషయమై మీడియాతో ఆనం మాట్లాడుతూ రిపబ్లిక్ డే వేడులకు తనకు ఎందుకు ఆహ్వానం పంపలేదని కలెక్టర్ ను నిలదీశారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు తమకు అర్హత లేదా ? ఈ పరిస్దితి ఎదురైనందుకు తాను సిగ్గుపడాలో, ఏం చేయాలో అర్ధం కావటం లేదు అంటూ అడగటం ఆశ్చర్యంగా ఉంది. అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన ఆనం ఇందుకు బాధ్యులపై ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

అసంతృప్తి వ్యక్తం చేయటంతో ఊరుకోకుండా రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానించకుండా అవమానించిన అధికారులపై కేసులు కూడా వేస్తానంటూ వార్నింగులిచ్చారు. తాజాగా ఆనం వార్నింగులతో ఇటు అధికారయంత్రాంగంలోను అటు ప్రజాప్రతినిధుల్లోను కలకలం రేగింది. రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవం లాంటి సందర్భాల్లో జరిగే వేడుకలకు జిల్లాలోని ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు పంపటం మామూలుగా జరిగేదే. ఇది ఎవరు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు అధికార యంత్రాగానికి. మరి ఈసారి ఏమైందో అర్ధం కావటంలేదు.

ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ఈమధ్యనే కోవూరు ఎంఎల్ఏ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా ఎస్పీని తీవ్రంగా వార్నింగ్ ఇచ్చిన విషయం అప్పట్లో సంచలనంగా మారింది. ఎస్సీ, ఎస్టీ కేసులకు సంబంధించి తమ కార్యకర్తలు ఫిర్యాదులు ఇఛ్చినా ఎస్పీ పట్టించుకోవటం లేదని ప్రసన్నకుమార్ రెడ్డి మండిపడ్డారు. తమ మాట కాదంటే ఎన్నిరోజులు జిల్లాలో ఉంటారో చూస్తామంటూ హెచ్చరించటాన్ని అప్పుడు అందరు తప్పుపట్టారు. మొత్తానికి నెల్లూరు జిల్లా ఎంఎల్ఏలు ఏదో రూపంలో సంచలనాలకు కేంద్రబిందువులవుతున్న విషయం వాస్తవం.